బంతిపై ఉమ్ము రుద్దడాన్ని పూర్తిగా నిషేధిస్తూ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా కెప్టెన్, కేకేఆర్ ఆటగాడు పాట్ కమిన్స్ స్పందించాడు. దీని వల్ల పేసర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నాడు.
సమస్యేమీ లేదు
బంతికి లాలాజలం రుద్దడాన్ని పూర్తిగా నిషేధిస్తూ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తీసుకున్న నిర్ణయంపై చర్చ కొనసాగుతూనే ఉంది. కరోనా నేపథ్యంలో 2020 నుంచి టెస్టు క్రికెట్‌లో బంతికి ఉమ్మి పూయడం నిషేధం కొనసాగుతోంది. క్రికెట్ చట్టాలను రూపొందించే ఎంసీసీ ఇప్పుడు పూర్తిగా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి ప్యాట్ కమిన్స్ స్పందించాడు. "లాలాజలం రుద్దడం నిషేధించడం పేస్ బౌలర్లకు పెద్ద సమస్యేమీ కాదు. స్వింగ్ బౌలర్ల ప్రదర్శనపై ప్రభావం చూపించదని భావిస్తున్నాం. ఎందుకంటే బంతి మెరుపు కోసం ఉమ్మికి బదులు చెమటను ఇప్పటికే ఉపయోగిస్తున్నాం. కాబట్టే ఇదేమీ పెద్ద విషయం కాదని చెబుతున్నా" అని కమిన్స్ వివరించాడు. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఆసీస్ జట్టు ఉంది.
ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టుపై..
2019 ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక ధరను (రూ. 15.50 కోట్లు) సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన కమిన్స్‌ను ఈసారి కేకేఆర్ రిటెయిన్ చేసుకోకుండా.. మెగావేలంలో రూ. 7.75 కోట్లకు దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. "గత సీజన్‌లో ఆడిన ఆటగాళ్లలో చాలా మందిని కేకేఆర్ మరోసారి సొంతం చేసుకుంది. అలానే శ్రేయస్ అయ్యర్‌తో కలిసి దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడాను. మా మధ్య మంచి సంబంధం ఉంది. ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. అందుకే శ్రేయస్‌తో పాటు కేకేఆర్ జట్టుకు ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా"
అని పేర్కొన్నాడు.
కోహ్లీతో బాబర్ అజామ్‌ను పోలుస్తూ..
టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ బ్యాటింగ్ స్టైల్‌పై ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. "ఫార్మాట్ ఏదైనా సరే వారిద్దరూ పూర్తిస్థాయి అద్భుతమైన బ్యాటర్లు. అందులో ఎలాంటి సందేహం లేదు. అత్యుత్తమ నాణ్యమైన ఆటను ఆడతారు. కోహ్లీ, బాబర్ ఆసీస్ మీద శతకాలు సాధించారు. వీరిద్దరితోపాటు కివీస్ సారథి కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ చేసేటప్పుడు కంగారు పడరు. సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేయగలరు. అవకాశం దొరికితే వేగంగా పరుగులు రాబడతారు" అని కమిన్స్ విశ్లేషించాడు.
ఇదీ చదవండి: కోహ్లీ, రోహిత్ కాదు! అతడే అయ్యర్ ఫేవరెట్ కెప్టెన్..