Virat Kohli Jahangir : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఒక్క సారైనా మైదానంలో బరిలోకి దిగాలనుకునే ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ప్రత్యర్థిగా ఆడినా చాలు తమ జీవితంలో ఒక మైలురాయిని సాధించామని సంతృప్తి చెందే ప్లేయర్ల జాబితా కూడా ఎక్కువే. ఇక ఇప్పటి యువ క్రికెటర్లకు విరాట్ ఓ మార్గదర్శకుడు. అయితే ఈ చిరకాల కోరికను నెరవార్చుకోవాలన్న ఆశయంతో మైదానంలో దూకుడుగా ఆడుతున్నాడు అమెరికా ఆటగాడు షయాన్ జహంగీర్.
ప్రస్తుత ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో అమెరికా జట్టు తరఫున ఆడుతున్న జహంగీర్.. పాక్‌లో జన్మించాడు. అక్కడ నుంచి అమెరికాకు మారిపోయాడు. ఇక క్వాలిఫయర్స్‌లో అమెరికా.. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. అయితే, జహంగీర్ మాత్రం సెంచరీ, హాఫ్ సెంచరీలతో మైదానంలో చెలరేగిపోయాడు. నేపాల్‌పై శతకం, నెదర్లాండ్స్‌పై అర్ధశతకాన్ని సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలో 'టాక్ ఆఫ్ ద టౌన్'గా మారిన ఈ కుర్రాడు తన జీవిత ఆశయాల్లో ఒక దాని గురించి తెలిపాడు. టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో తలపడే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు.
"విరాట్ కోహ్లీతో ప్రత్యర్థిగా తలపడాలి. ఇదే నా ఏకైక లక్ష్యం. అతడితో ఆడినప్పుడు నా సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాను. ఇలాంటి మెగా టోర్నీల్లో అటువంటి అవకాశం వస్తే ఇంకా బాగుంటుంది" అని జహంగీర్ తెలిపాడు.
ఇక పాకిస్థాన్ అండర్ - 19 జట్టు తరఫున ఆడిన జహంగీర్ ఆ తర్వాత యూఎస్‌ఏకు మారిపోయాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఆడిన అనుభవం అతడి సొంతం. దీంతో ఇప్పటి వరకు అమెరికా తరఫున 10 వన్డేలు ఆడిన జహంగీర్ 306 పరుగులు చేశాడు.
యూఎస్‌ఏ పేసర్‌కు షాక్
USA Cricket Team : వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓడిన యూఎస్‌ఏకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ కేల్ ఫిలిప్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ వేయకుండా ఐసీసీ సస్పెండ్ చేసింది. వెస్టిండీస్‌పై మూడు వికెట్లు తీసి సత్తా చాటినప్పటికీ.. అతడి బౌలింగ్ యాక్షన్ అనైతికంగా ఉన్నట్లు భావించిన ఐసీసీ.. ప్యానెల్ నిబంధనల మేరకు ఈ నిషేధం విధించింది. ఆర్టికల్ 6.7 రెగ్యులేషన్స్ ప్రకారం బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల అతన్ని సస్పెండ్ చేసినట్లు ఐసీసీ ఆ ప్రకటనలో తెలిపింది.