PAK vs AUS: 24 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. 1998లో చివరిసారి మార్క్ టేలర్ సారథ్యంలో పాక్‌లో పర్యటించిన కంగారూల జట్టు మళ్లీ ఇన్నాళ్లకు అక్కడ ఆడేందుకు సిద్ధమైంది. అప్పుడు ఆస్ట్రేలియా 1-0తో మూడు టెస్టుల సిరీస్‌తో పాటు 3-0తో మూడు వన్డేల సిరీస్‌నూ ఎగరేసుకుపోయింది. ఇక తాజాగా ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో 18 మంది ఆటగాళ్ల బృందం ఆదివారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్‌కు చేరుకుంది. ఇది కెప్టెన్‌గా కమిన్స్‌కు తొలి అంతర్జాతీయ పర్యటన కావడం విశేషం. మరోవైపు ఇటీవలే ఆసీస్ హెడ్‌కోచ్‌గా జస్టిన్ లాంగర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆండ్రూ డోనాల్డ్ ఆ జట్టుకు కోచ్‌గా తాత్కాలిక సేవలు అందిస్తున్నాడు.
కాగా, 2009లో శ్రీలంక పాక్ పర్యటనలో ఉండగా ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ జట్లు వెనుకడుగు వేశాయి. ఈ క్రమంలోనే ఆరేళ్ల పాటు పాకిస్థాన్ సైతం స్వదేశీ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించింది. అయితే, గతేడాది నుంచి ఇతర జట్లు పాక్‌లో పర్యటించడానికి సిద్ధపడినా గత సెప్టెంబర్‌లో న్యూజిలాండ్ టీమ్, అక్టోబర్‌లో ఇంగ్లాండ్ టీమ్ తమ పర్యటనలను అర్థాంతరంగా వద్దనుకున్నాయి. భద్రతా కారణాలతోనే ఆయా జట్లు వెనుకడుగు వేశాయని చెప్పాయి. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ఇప్పుడు అక్కడ పర్యటించడం గమానర్హం. మరోవైపు పాక్‌లో ఆడేందుకు పలువురు ఆసీస్ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టులు కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు సహా ఓ టీ20 ఆడనుంది.
ఇదీ చూడండి : రాహుల్‌తో పెద్దగా కనెక్ట్ కాలేకపోయా: కోహ్లీ