Suraj randiv bus driver: క్రికెట్‌లో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అయితే కేవలం ఆయా బోర్డులు ఇచ్చే భత్యాలపైనే ఆధారపడాల్సి ఉండేది. కానీ, ఎప్పుడైతే భారత టీ20 లీగ్ వచ్చిందో సెలెక్ట్ అయిన ఆటగాళ్లకు కాసులపంటే పండుతోంది. ఒక్క మ్యాచ్ ఆడినా లక్షల్లో దక్కుతున్నాయి. ఆటకు వీడ్కోలు పలికితే వ్యాఖ్యాతగా మారొచ్చు. ఏదైనా లీగ్‌ల్లో సహాయక సిబ్బందిగా చేరే ఛాన్స్‌లు వస్తుంటాయి. లేకపోతే క్రికెట్ ట్రైనింగ్ ఇస్తూనైనా సంపాదించవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కొందరి పరిస్థతి మాత్రం దుర్భరంగా మారిందనేదానికి ఈ మాజీ ఆటగాడే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం తన కుటుంబం కోసం డ్రైవర్‌గా మారిపోయిన ఆ మాజీ క్రికెటర్ శ్రీలంకకు చెందిన సూరజ్ రణ్‌దివ్. లంక తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో దాదాపు 85 వికెట్లు పడగొట్టాడు. భారత టీ20 లీగ్‌లోనూ ఆడటం విశేషం. ఆకాశం ఎత్తుకు ఎదిగిన ఆటగాడు ఒక్క ఉదుటన కిందికి పడిపోయిన సూరజ్ జీవితం ప్రతి క్రికెటర్‌కు గుణపాఠంలాంటిదే. అతడి జీవితం ఎందుకు ఇలా మారిందో కారణాలు తెలియదు కానీ.. ప్రస్తుత తరం ఆటగాళ్లు మాత్రం పక్కాగా లైఫ్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ధోనీ నాయకత్వంలో..
2009లో లంక జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన సూరజ్ కేవలం ఏడేళ్లకే తన కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. 2011 వరల్డ్ కప్‌లో పాల్గొన్న లంక జట్టులో సభ్యుడు. అయితే ధోనీ కెప్టెన్సీలో భారత్ 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో లంకను ఓడించి మరీ నెగ్గిన విషయం తెలిసిందే. తుదిపోరులో సూరజ్ పెద్దగా రాణించలేదనే చెప్పాలి. అయితే కేవలం రెండేళ్లకే జాతీయ జట్టులోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకతను చాటుకొన్నాడు. దీంతో భారత టీ20 లీగ్‌లోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. అదీనూ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టులో స్థానం సంపాదించాడు. అయితే 2011 సీజన్‌లో కేవలం ఎనిమిది మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. ఆరు వికెట్లను తీశాడు. ఇక తర్వాతి సీజన్ నుంచి భారత టీ20 లీగ్‌లో మళ్లీ కనిపించలేదు.
సెహ్వాగ్‌కు సెంచరీ దక్కకుండా..
చాలా మంది క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. వారు ఏ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినా అభిమానం తగ్గదు. ఎందుకంటే మైదానంలో ఆయా క్రికెటర్ల వ్యవహారధోరణి కూడా అందుకు కారణం. కానీ కొంతమంది మాత్రం తమ దూకుడైన ప్రవర్తనతోపాటు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు ఏదైనా రికార్డు సాధిస్తే మాత్రం తట్టుకోలేనితనం ప్రదర్శిస్తే అప్రతిష్ఠపాలవుతారు. ఇలాంటి వ్యవహారమే భారత అభిమానుల ఆగ్రహానికి సూరజ్ గురయ్యేలా చేసింది. 2010లో భారత్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో ట్రైసిరీస్ జరిగింది. లీగ్ దశలో లంకను 170 పరుగులకే టీమ్‌ఇండియా ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (99*) అద్భుతంగా ఆడాడు. కేవలం 34.3 ఓవర్లలోనే 171 పరుగులు చేసిన భారత్ విజయం సాధించింది. అయితే ఇక్కేడ సూరజ్ అభిమానుల కోపాగ్నికి బలయ్యాడు. సెహ్వాగ్ సెంచరీకి, భారత్ విజయానికి కేవలం ఒక్క పరుగు అవసరమైన క్రమంలో సూరజ్ కుటిల నీతిని ప్రదర్శించాడనే చెప్పాలి. అప్పటికీ సెహ్వాగ్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో సూరజ్ బంతిని నోబాల్ వేసి సెహ్వాగ్‌కు శతకం పూర్తి కాకుండా చేశాడు. ఆ బంతిని సిక్స్‌గా మలిచిన్నప్పటికీ.. నోబాల్‌తో ఫలితం తేలిపోయింది. ఈ క్రమంలో సూరజ్ తీరు వివాదాస్పదంగా మారింది. సూరజ్ భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అపకీర్తిపాలయ్యాడు.
ఇదీ చూడండి : టీమ్‌ఇండియా మరో సిరీస్ పట్టేస్తుందా.. వెస్టిండీస్‌తో రెండో వన్డే నేడే