MS Dhoni Ravi Shastri: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి ఫుట్‌బాల్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు అతడు క్రికెట్‌లోకి రాకముందు ఫుట్‌బాల్ మీదే ఎక్కువ ధ్యాస పెట్టాడు. అనుకోని పరిస్థితుల్లో క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఒకసారి ధోనీ ఆ ఆట ఆడుతుంటే గట్టిగా అరిచానని టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. ఇటీవల టీ20 లీగ్‌లో కామెంట్రీ చేస్తోన్న ఆయన.. ఆరోజు ధోనీపై ఎందుకు కోపం వచ్చిందో వివరించాడు.
"ధోనీకి ఫుట్‌బాల్ ఆడటమంటే చాలా ఇష్టం. అతడు ఆడే తీరు చూస్తే మనకు భయమేస్తుంది. అంత ఇంటెన్సిటీతో ఆడతాడు. మహీ అలా ఆడుతుంటే పొరపాటున గాయాలబారిన పడితే ఎలా..? ఒకసారి ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టాస్ వేసే ఐదు నిమిషాల ముందు మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. దాంతో నాకు కోపం వచ్చి గట్టిగా అరిచాను. నా జీవితంలో అలా ఎప్పుడూ అరవలేదు. ఎవరైనా కీలక మ్యాచ్‌కు ముందు తమ అత్యుత్తమ ఆటగాడు గాయాలపాలవ్వాలని అనుకోరు కదా.. అందుకే.. ఫుట్‌బాల్ ఆడటం ఆపేయాలని అరిచేశాను. అయితే, అతడిని ఫుట్‌బాల్‌కు దూరం చెయ్యడం చాలా కష్టమైంది" అని శాస్త్రి వివరించాడు.
ఇదీ చూడండి: Ravi Shastri: 'చెన్నై కెప్టెన్‌గా అతడిని నియమించాల్సింది'