ఈ సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇషాన్ కిషన్ వరుసగా 81, 54పరుగులు చేశాడు. ఆరంభంలో ఊపు చూస్తే కిషన్ తన ధరకు న్యాయం చేస్తున్నట్లే అనిపించింది. కానీ అతడి జోరు ఈ రెండు మ్యాచ్‌లకే పరిమితం. తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ అతను కనీసం 30 కూడా దాటలేదు. చివరి 6 మ్యాచ్‌ల్లో అతను చేసింది 64 పరుగులు మాత్రమే. తర్వాతి మ్యాచ్‌కు కిషన్‌కు తుది జట్టులో చోటుంటుందో లేదో తెలియని పరిస్థితి. ముంబయి జట్టులో దాదాపు ప్రధాన ఆటగాళ్లందరూ..‘రేటెక్కువ-ఆట తక్కువ’ విభాగంలోకే వస్తారు. ఆ జట్టు రూ.16 కోట్లతో అట్టిపెట్టుకున్న రోహిత్ శర్మ 8 మ్యాచ్‌ల్లో 19.12 సగటుతో 153 పరుగులే చేశాడు. అతను ఇప్పటిదాకా ఒక్క అర్ధశతకం కూడా సాధించలేదు. ఇక ఎప్పుడూ వికెట్ల వేటలో ముందుండే ఫాస్ట్‌బౌలర్ బుమ్రా మ్యాచ్‌కు సగటున ఒక్క వికెట్ కూడా తీయలేదు. 8 మ్యాచ్‌ల్లో 5 వికెట్లతో తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అతడిని ముంబయి రూ.12 కోట్లతో అట్టిపెట్టుకుంది. రూ.6 కోట్లతో ఆ జట్టు సొంతమైన పొలార్డ్ కూడా తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. 115 పరుగులు, 3 వికెట్లతో ‘ఆల్‌రౌండర్’గా తనకున్న పేరును నామమాత్రం చేసుకున్నాడు. ఈ సీజన్లోనే కొత్తగా ముంబయి జట్టు సొంతమైన సింగపూర్ కుర్రాడు టిమ్ డేవిడ్ వేలంలో దక్కించుకున్నది రూ.8.25 కోట్లు. కానీ రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 1 పరుగులు చేసిన అతణ్ని ముంబయి మళ్లీ ఆడించనే లేదు. ముంబయి రూ.8 కోట్లతో దక్కించుకున్న ఆర్చర్ గాయంతో అసలు టీ20కు రానే లేదు.
మరో మాజీ ఛాంపియన్ చెన్నై పేలవ ప్రదర్శనకు కూడా స్టార్ ఆటగాళ్ల వైఫల్యమే కారణం. ఆ జట్టు అట్టిపెట్టుకున్న జడేజా (రూ.16 కోట్లు), ధోని (రూ.12 కోట్లు), మొయిన్ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్ (రూ.6 కోట్లు)ల్లో ఒక్కరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 8 మ్యాచ్‌ల్లో జడేజా 112 పరుగులు చేసి 5 వికెట్లే పడగొట్టగా.. ధోని 132 పరుగులే సాధించాడు. 5 మ్యాచ్‌లాడి 86 పరుగులే చేసిన మొయిన్ అలీ.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. రుతురాజ్ 138 పరుగులకే పరిమితం అయ్యాడు. రూ.14 కోట్లతో కొనుక్కున్న దీపక్ చాహర్ గాయంతో ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో లేకుండా పోవడం చెన్నైకి గట్టి ఎదురు దెబ్బే.
ఈ సీజన్లో పంజాబ్ ఒడుదొడుకుల ప్రయాణానికి.. ఆ జట్టు భారీ రేటుతో సొంతం చేసుకున్న ఆటగాళ్లు కారణం. ప్రధానంగా రూ.12 కోట్లతో పంజాబ్ అట్టిపెట్టుకున్న కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒకే అర్ధశతకం సాధించాడు. మొత్తం 136 పరుగులే చేశాడు. ఆ జట్టు అట్టిపెట్టుకున్న రెండో ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు) 8 మ్యాచ్‌ల్లో 3 వికెట్లే తీశాడు. ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ ప్రదర్శన (8 మ్యాచ్‌ల్లో 245 పరుగులు, 2 వికెట్లు) పర్వాలేదు కానీ.. అతడి ధర (రూ.11.5 కోట్లు)కు న్యాయం చేసేది మాత్రం కాదు. రూ.9.25 కోట్లతో పంజాబ్ సొంతమైన రబాడ 7 మ్యాచ్‌ల్లో 9 వికెట్లే తీశాడు. తన స్థాయికి ఇది సాధారణ ప్రదర్శనే. రూ.9 కోట్లకు కొనుక్కున్న తమిళనాడు హిట్టర్ షారుఖ్ ఖాన్.. 7 మ్యాచ్‌ల్లో 98 పరుగులే చేయడంతో అతణ్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. రూ.6 కోట్లతో పంజాబ్ సొంతమై భారీ అంచనాలతో లీగ్‌లో అడుగు పెట్టిన విండీస్ ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్ 6 మ్యాచ్‌ల్లో 51 పరుగులే చేసి, 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. రూ.6.75 కోట్లు పలికిన బెయిర్‌స్టో ఈ సీజన్లో ఒక్కసారీ బ్యాట్ ఝులిపించలేదు. 5 మ్యాచ్‌లాడి 47 పరుగులే చేశాడు.
దిల్లీ జట్టులోనూ రేటుకు న్యాయం చేయని ఆటగాళ్లున్నారు. శార్దూల్ ఠాకూర్ (రూ.10.75 కోట్లు-7 మ్యాచ్‌ల్లో 80 పరుగులు, 4 వికెట్లు), అక్షర్ పటేల్ (రూ.9 కోట్లు- 7 మ్యాచ్‌ల్లో 79 పరుగులు, 3 వికెట్లు) ఆ జట్టుకు భారంగా మారారు. రూ.6.5 కోట్లతో ఆ జట్టు అట్టిపెట్టుకున్న పేసర్ నోకియా.. ఒక మ్యాచ్ ఆడి వికెట్ తీయకపోవడంతో బెంచ్‌కు పరిమితం అయ్యాడు. రూ.6.5 కోట్లతో ఆ జట్టు సొంతం చేసుకున్న మిచెల్ మార్ష్ ఒక మ్యాచ్ ఆడి ఘోరంగా విఫలమై, తర్వాత కరోనా బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.
బెంగళూరు జట్టులోనూ 'రేటెక్కువ-ఆట తక్కువ' ఆటగాళ్లున్నారు. రూ.15 కోట్ల కోహ్లి 9 మ్యాచ్‌ల్లో 128 పరుగులే చేశాడు. 1, 12, 0, 0, 9.. చివరి 5 మ్యాచ్‌ల్లో అతడి స్కోర్లివి. రూ.11 కోట్ల మ్యాక్స్‌వెల్ 6 మ్యాచ్‌ల్లో 114 పరుగులు చేసి, ఒక్క వికెట్టే తీశాడు. కోల్‌కతా జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రసెల్ మాత్రమే బాగా ఆడుతున్నాడు. వెంకటేశ్ అయ్యర్ (రూ.8 కోట్లు-8 మ్యాచ్‌ల్లో 126 పరుగులు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు- 8 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు), నరైన్ (రూ.6 కోట్లు-8 మ్యాచ్‌ల్లో 27 పరుగులు, 6 వికెట్లు) సాధారణ ప్రదర్శన చేస్తున్నారు. గత సీజన్‌తో పోలిస్తే కమిన్స్ రేటు (రూ.7.25 కోట్లు) సగానికి సగం తగ్గినా.. ఆ రేటుకు కూడా అతను న్యాయం చేయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ మెరుపులతో అదరగొట్టిన కమిన్స్ (56 పరుగులు, 2 వికెట్లు).. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో 7 పరుగులు చేసి, 2 వికెట్లే తీసి తుది జట్టులో చోటు కోల్పోయాడు.
హైదరాబాద్ జట్టులో రొమారియో షెఫర్డ్ (రూ.7.75 కోట్లు- 2 మ్యాచ్‌ల్లో 32 పరుగులు, 3 వికెట్లు), అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు- 2 మ్యాచ్‌ల్లో 4 పరుగులు) సత్తా చాటలేక తుది జట్టుకు దూరమయ్యారు. పంజాబ్ ఆటగాడు హర్‌ప్రీత్ (రూ.3.8 కోట్లు- 2 మ్యాచ్‌ల్లో 14 పరుగులు, 0 వికెట్లు) పరిస్థితీ ఇంతే. రాజస్థాన్ రూ.9 కోట్లు పెట్టి కొన్న తెవాతియా ఒక మ్యాచ్‌లో సంచలన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించినా.. ఓవరాల్ ప్రదర్శన (8 మ్యాచ్‌ల్లో 96 పరుగులు, 0 వికెట్లు) బాగా లేదు. మరోవైపు మంచి రేటు పెట్టి కొన్న ఆటగాళ్లను కొన్ని జట్లు తుది జట్టులోకే తీసుకురాకపోవడం గమనార్హం. సుదీప్ త్యాగి (హైదరాబాద్-రూ.4 కోట్లు), చేతన్ సకారియా (దిల్లీ-రూ.4.2 కోట్లు), సాయికిశోర్ (గుజరాత్-రూ.3 కోట్లు) ఈ జాబితాలో ఉన్నారు.
ఇదీ చూడండి: చేతులెత్తేసిన బెంగళూరు.. రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం