ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో ఆడిన ఇన్నింగ్స్ తన కెరీర్లో అత్యంత సవాల్‌తో కూడుకున్నదని టీమ్‌ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. జట్టుకు శుభారంభం అందించినందుకు సంతోషంగా ఉందన్నాడు. పరిస్థితులు కఠినంగా ఉన్నా బాగానే ఆడామని వెల్లడించాడు. తొలిరోజు ఆట ముగిశాక అతడు మీడియాతో మాట్లాడాడు.
"ఇంకా ఆడుతున్నాను కాబట్టి ఇదే అత్యుత్తమం అని చెప్పను. మున్ముందు మరిన్ని అవకాశాలు వస్తాయి. నేనాడిన ఇన్నింగ్సుల్లో ఇదే అత్యంత సవాల్‌తో కూడిందని చెప్పగలను. మేం ఆరంభించిన తీరుకు సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తు ఔటయ్యా. కానీ పొరపాట్లేమీ చేయలేదు. ‘టెస్టు క్రికెట్లోని సవాలే ఇది. మనకు అనేక షాట్లు తెలిసుండొచ్చు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రం నిత్యం మనతో మనమే మాట్లాడుకోవాలి. ప్రత్యేకించి కొత్త బంతితో ఆడుతున్నప్పుడు అనవసర షాట్లను తగ్గించుకోవాలి" అని హిట్‌మ్యాన్ అన్నాడు.
"వాతావరణానికి అలవాటు పడ్డాక, పిచ్‌పై కాస్త నిలదొక్కుకున్నాక కొన్ని షాట్లు ప్రయత్నించొచ్చు. అయితే పరిస్థితులను గౌరవించడం అంతకన్నా కీలకం. ఒక బ్యాటింగ్ యూనిట్‌గా ఆసీస్ పర్యటన నుంచి ఇప్పటి వరకు మేం బాగానే ఆడుతున్నాం. బ్యాటర్లు ఇప్పుడు తమ పాత్రలపై మరింత స్పష్టతతో ఉన్నారని అనిపిస్తోంది" అని రోహిత్ వెల్లడించాడు.
రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సరికి టీమ్‌ఇండియా 276/3తో నిలిచింది. రాహల్ 127* అజేయంగా నిలిచాడు. రోహిత్ 83 పరుగులతో ఆకట్టుకున్నాడు.