Mithali Raj worldcup: వారం రోజుల్లో జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని కెప్టెన్ మిథాలీరాజ్ తెలిపింది. దీంతో పాటే జట్టు సభ్యుల్లో కీలకంగా మారే అవకాశం ఉన్న ప్లేయర్ల గురించి ఆమె మాట్లాడింది.
"ఈ ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇక గత సంవత్సరం కాలంలో యువ క్రికెటర్ల కోసం తీవ్రంగా అన్వేషించాం. వారిలోని టాలెంట్‌ను గుర్తించాం. రిచా ఘోష్, షఫాలీ వర్మ, మేఘ్న సింగ్, పూజా వస్త్రాకర్ వంటి వారిలో ఆ సత్తా ఉంది. వారందరికీ తగిన సమయం ఇవ్వడం జరిగింది. జట్టు కూర్పులో వారి స్థానాలపై గత సిరీస్‌లు కెప్టెన్‌గా నాకు చాలా ఉపయోగపడ్డాయి. వ్యక్తిగతంగా ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. పరుగులు చేయగలిగాను. ఇదే ఫామ్‌ను ప్రపంచకప్ అంతా కొనసాగిస్తా. మెగా టోర్నీల్లో ఆడేటప్పుడు యువ క్రీడాకారిణులకు ఒకటే సలహా ఇస్తా. ఒత్తిడిగా భావిస్తే ఉత్తమమైన ఆటను ఆడలేము. జట్టుకు, వ్యక్తిగతంగా ఉపయోగపడేలా మాత్రమే ఆడాలని చెప్తా" అని మిథాలీ వెల్లడించింది.
ఈ ప్రపంచకప్‌లో మిథాలీరాజ్ పాల్గొనడం ద్వారా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ఇది ఆమెకు ఆరో ప్రపంచకప్. న్యూజిలాండ్ వేదికగా మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రపంచకప్ పోటీలు జరుగుతాయి. ప్రపంచకప్‌లో భాగంగా ఇక టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.
కాగా, ఈ ప్రపంచకప్ కోసం ఇప్పటికే అన్ని జట్లూ తమ సాధనను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. రేపటి నుంచి వార్మప్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా ఆడనుంది. ప్రస్తుతం భారత్ న్యూజిలాండ్‌లోనే ఉంది. ఆ జట్టుతో ఒక టీ20, ఐదు వన్డేలను ఆడింది. వన్డే సిరీస్‌ను కోల్పోయినప్పటికీ.. ఈ అనుభవంతో ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదీ చూడండి: అతడు ఇంకా క్షమాపణలు చెప్పలేదు: సాహా