ఐపీఎల్ మినీ వేలానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ తమ తమ గల్లా పెట్టెలను సరిచూసుకుంటున్నాయి. ఎవరిని.. ఎంతకు కొనాలో అని లెక్కలు వేసుకుంటున్నాయి. హోం టీమ్ సన్‌రైజర్స్ కుడా అదే పని చేస్తోంది. అయితే అందరి కన్నా హైదరాబాద్ జట్టు వద్దనే డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. రూ. 42 కోట్ల పర్స్ వాల్యూతో వేలానికి సన్నద్ధమవుతోంది సన్‌రైజర్స్. కానీ సన్‌రైజర్స్‌ను కొన్ని సమస్యలతో సతమతమవుతోంది.
స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఐపీఎల్ మెగా వేలానికి ముందు హైదరాబాద్ జట్టు రిలీజ్ చేసింది. దీంతో గడేడాది టీమ్ స్పిన్నర్ గ్యాప్ అలాగే ఉండిపోయింది. దీనివల్ల బౌలింగ్ సమయంలో.. మిడిల్ ఓవర్లలో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఈసారైనా ఆ స్పిన్నర్ లోటును పూడ్చుకోవాలని ఆశిస్తోంది. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఈసారి మినీ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. దీంతో అతడిని తీసుకుని స్పిన్నర్ లోటును భర్తీ చేసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. కానీ ఫ్రాంఛైజీల మధ్య పోటీ తలెత్తితే అతడు కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంది. కాగా, సన్‌రైజర్స్ వద్ద టెయిల్ ఎండ్ బ్యాటర్లలో ఒక్క ఆల్‌రౌండర్ కూడా లేదు. ఇప్పటి వరకు టాప్, మిడిలార్డర్‌పైనే ఆధారపడిన సన్‌రైజర్స్ ఈసారి లోయర్ ఆర్డర్‌ని కూడా గాడిలో పెట్టాలని భావిస్తోంది.
దీంతో పాటు జట్టుకు సరైన కెప్టెన్ లేని లోటు కూడా సన్‌రైజర్స్‌ను బాగా వేధిస్తోంది. దిగ్గజ కెప్టెన్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌ను వదులుకున్న హైదరాబాద్‌కు.. ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో ఈ మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఎలాగైనా తీసుకోవాలని సన్‌రైజర్స్ సంకల్పంతో ఉంది. అయితే డిసెంబర్ 23 జరిగే మినీ వేలంలో ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. జట్టును ముందుండి నడిపిస్తున్న సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్.. ఈసారి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.