చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీకి(MS Dhoni) భారత్‌లో అభిమానుల ఆదరణ చూసి బుర్ర పనిచేయలేదని ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్(Sam Billings) అన్నాడు. 2018, 19 సీజన్లలో చెన్నై తరఫున ఆడిన సామ్.. ఆ సమయంలో ధోనీని దగ్గరుండి చూశానని చెప్పాడు. మహీ సారథ్యంలో ఆడటం తాను గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు.
"చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ కెప్టెన్సీలో ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. దాంతో అతడిని దగ్గరుండి చూసే అవకాశం దక్కింది. హోటల్లో అతడి జీవనశైలిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. మ్యాచ్ జరిగేటప్పుడు లేదా ప్రాక్టీస్‌కు వెళ్లినప్పుడు మాత్రమే అతడిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అస్సలు వదలబుద్ధి కాదు. ఇక్కడి ప్రజలు ధోనీని ఎలా ఆరాధిస్తారో చూస్తే బుర్ర పనిచేయదు" అని సామ్ చెప్పుకొచ్చాడు.
అలాగే ఇంగ్లాండ్‌లో ఎవరినైనా క్రికెట్ అంటే ఇష్టమా? అని అడిగితే వాళ్లకి ఇష్టమనో.. ఇష్టం లేదనో చెప్పొచ్చని, అదే భారత్‌లో అలాంటి పరిస్థితి ఉండదని సామ్ పేర్కొన్నాడు. ఇక్కడ ఎవర్ని అడిగినా క్రికెట్ అంటే పడి చచ్చిపోతారని అన్నాడు.
సామ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరఫున 2018లో పది మ్యాచ్‌లే ఆడి 108 పరుగులు చేశాడు. అందులో ఒక్క అర్ధశతకం బాదాడు. ఇక 2019లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడినా.. తర్వాత అవకాశం దక్కలేదు. ఈ క్రమంలోనే 2020లో అసలు టోర్నీలోనే లేడు. అయితే, ఈసారి వేలంలో దిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.2కోట్లకు కొనుగోలు చేయగా ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మరి సెప్టెంబర్‌లో జరిగే రెండో భాగంలో అయినా అతడు బరిలోకి దిగుతాడో లేదో వేచిచూడాలి. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం ఐపీఎల్ తిరిగి ప్రారంభమైతే తమ ఆటగాళ్లను ఆడించబోమని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: Jadeja: ధోనీ సలహాతో బ్యాటింగ్‌లో రెచ్చిపోతున్నా!