Michael Vaughan James Anderson: జేమ్స్ అండర్సన్ లాంటి దిగ్గజ పేసర్‌ను ఇంగ్లాండ్ టీమ్ పక్కనపెట్టాల్సిన అవసరం ఉందని, ఆ సమయం ఆసన్నమైందని ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అండర్సన్ లేని లోటును పూడ్చడం ఇంగ్లాండ్ జట్టుకు కీలకంకానుందని చెప్పాడు. ఇలా చేయడం అతడిని తప్పించడం కాదని, జట్టుకు అవసరమైన పని చేయడమని మాజీ సారథి చెప్పుకొచ్చాడు. మున్ముందు అండర్సన్ రిటైర్మెంట్ ఆసక్తి కలిగిస్తుందని అన్నాడు. దీంతో అతడి వ్యవహారంలో ఇంగ్లాండ్ టీమ్ జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచించాడు. అందుకోసం అండర్సన్‌తో ప్రత్యేకంగా చర్చించాలని చెప్పాడు.
అలాగే జట్టులో జరుగుతున్న వాస్తవిక పరిస్థితులను వివరంగా చెప్పాలన్నాడు వాన్. అతడికి అర్థమయ్యేలా చాలా స్పష్టంగా వివరించాలన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అండర్సన్‌ను నమ్ముకొని ఇంగ్లాండ్ టీమ్ మేటి టెస్టు జట్టుగా ఎదిగే వీలులేదన్నాడు. అతడి బౌలింగ్ చూడటమంటే తనకూ ఇష్టమని వాన్ పేర్కొన్నాడు. కానీ.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్లు షేన్‌వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్ లాంటి దిగ్గజాలు సైతం కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించారని గుర్తుచేశాడు. వయసు పెరిగినా వికెట్లు తీస్తున్నామనే కారణంతో జట్టులో అలాగే కొనసాగకూడదని రాసుకొచ్చాడు. కాగా, ఇప్పటికే 39 ఏళ్ల వయసు కలిగిన అండర్సన్ ఇంగ్లాండ్ జట్టులో కీలక పేసర్‌గా ఉన్నాడు. ఇప్పటివరకు మొత్తం 169 టెస్టులు ఆడగా.. అందులో 640 వికెట్లు తీశాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. స్పిన్ మాంత్రికులు ముత్తయ్య మురళీధరన్ 800, షేన్‌వార్న్ 708 వికెట్లతో అతడికన్నా ముందున్నారు. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోనూ ఈ ఇంగ్లాండ్ పేసర్.. మూడు టెస్టులు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని వాన్ తన అభిప్రాయాలు రాసుకొచ్చాడు.
ఇదీ చదవండి:
స్టోక్స్ 'లా' వీరికీ అదృష్టం కలిసొచ్చింది!
'రూట్ సేనకు.. టీమ్ఇండియా 'సిడ్నీ' సూపర్ ఇన్నింగ్సే ఆదర్శం'