Mayank Agarwal LBW: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (60; 123 బంతుల్లో 9x4) వివాదాస్పదరీతిలో ఔటవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎంగిడి వేసిన 41వ ఓవర్ రెండో బంతి.. మయాంక్ ప్యాడ్లకు తాకగా సఫారీలు అప్పీల్ చేశారు. బంతి లెగ్‌స్టంప్ వెనక్కి వెళ్తున్నట్లు అనిపించడం వల్ల ఫీల్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. ఈ క్రమంలోనే డీఆర్‌ఎస్‌కు వెళ్లగా బాల్ ట్రాకింగ్ సమయంలో ఆ బంతి లెగ్‌స్టంప్ అంచులను తాకుతున్నట్లు అనిపించింది. ఆ విషయాన్ని బిగ్‌స్క్రీన్‌పై చూస్తున్న మయాంక్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. చివరికి అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో టీమ్‌ఇండియా ఓపెనర్ నిరాశగా వెనుదిరిగాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ మయాంక్ నిరుత్సాహంగా కనిపించాడు.
అనంతరం మీడియా తన ఎల్బీడబ్ల్యూపై ప్రశ్నించగా టీమ్‌ఇండియా ఓపెనర్ సమాధానం ఇవ్వడానికి నిరాకరించాడు. "నిజం చెప్పాలంటే ఈ విషయంపై నా అభిప్రాయం చెప్పడానికి అవకాశం లేదు. దాన్ని నేను వదిలేస్తున్నా. ఎందుకంటే దీనిపై స్పందించి నేను మ్యాచ్ ఫీజులో కోతకు గురవ్వాలని అనుకోవడం లేదు. అలాగే అనవసర వివాదాల్లోనూ చిక్కుకోవాలని నాకు అనిపించడం లేదు" అని మయాంక్ వివరించాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమ్ఇండియా.. ఓపెనర్లుగా వచ్చిన మయాంక్, కేఎల్ రాహుల్ (122*) నిలకడగా ఆడారు. ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. దీంతో భారత్‌కు శుభారంభం దొరికింది. కానీ, దురదృష్టవశాత్తూ మయాంక్ అర్ధశతకం తర్వాత ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.