కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడి ఇప్పటికే దాదాపు రెండు వారాలు కావొస్తుంది. వృద్ధిమాన్ సాహా, ప్రసిధ్ కృష్ణ.. మహమ్మారి నుంచి కోలుకోలేదు. వారింకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ, బౌలింగ్ కోచ్ బాలాజీకి కరోనా నెగెటివ్‌గా తేలింది.
అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే టీకాలు వేయడానికి ఫ్రాంఛైజీలు ప్రయత్నించాయి! కానీ, వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆటగాళ్లు సుముఖత చూపలేదని ఓ క్రీడా ఛానల్ తెలిపింది. వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే స్వల్ప జ్వరానికి భయపడిన క్రికెటర్లు.. టోర్నీకి ముందు అనారోగ్యానికి పాలు కాకుడదని టీకాను నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇది క్రికెటర్ల తప్పిదం ఎంతమాత్రం కాదని.. టీకా గురించి అవగాహన లేకపోవడమే కారణమని సదరు ఛానల్ వెల్లడించింది.
వ్యాక్సినేషన్ విషయంలో విదేశీ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. కానీ, అందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. దీంతో వారికి కూడా వ్యాక్సిన్ వేయలేదు.
సాహా, ప్రసిధ్ అనుమానమేనా?
ఇంగ్లాండ్ వేదికగా కివీస్‌తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ప్రకటించిన జాబితాలో సాహా, ప్రసిధ్‌కు చోటు లభించింది. అయితే ఐపీఎల్ సమయంలో కరోనా బారిన పడిన వీరిద్దరూ.. ఇంకా కోలుకోలేదు. వారికి కొవిడ్ నెగెటివ్ రావాల్సి ఉంది. ఈ ఇరువురు మే 25న ముంబయిలో రిపోర్ట్ చేయాలి. ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కేలోపు మూడు సార్లు కరోనా నెగెటివ్ సమర్పించాల్సి ఉంది.
ఇదీ చదవండి: చెన్నై బ్యాటింగ్ కోచ్ హస్సీకి కొవిడ్ నెగెటివ్