సౌరభ్ గంగూలీ.. భారత క్రికెట్‌లో సంచలనం. సగటు అభిమానికి బెంగాల్ టైగర్. బ్యాట్‌తో పరుగుల వరద పారించినా.. కెప్టెన్సీతో ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించినా.. బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసినా.. అది ఆయనకే చెల్లింది. ఆటగాడిగా మొదలైన ప్రయాణం క్రికెట్ పాలకుడిగా ఘనంగా ముందుకు సాగుతోంది. కెరీర్‌లో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా నిరంతరం తల ఎత్తుకుని ముందుకు సాగిన అతడి ప్రయాణం ఓ చరిత్ర. ఆ చరిత్రే మరికొద్ది రోజుల్లో వెండితెరపై ‘దాదా బయోపిక్‌గా’ మనముందుకు రానుంది. అందులో గంగూలీ పాత్రను ఏ హీరో పోషించినా క్రికెట్ అభిమానులకు మాత్రం అతడే ఓ హీరో. అంతగొప్ప ఆటగాడి కథలో ఎన్నో మజిలీలున్నాయి.
ఆడేందుకు వచ్చా.. కూల్‌డ్రింక్స్ ఇచ్చేందుకు కాదు..
గంగూలీది స్వతహాగా భిన్నమైన వ్యక్తిత్వం. చిన్నప్పటి నుంచే తనకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకునేవాడు. ఆ స్వభావమే కెరీర్ ఆరంభంలో వివాదాస్పదంగా మారింది! 1990-91 రంజీ సీజన్‌లో ఆకట్టుకోవడంతో 1992లో తొలిసారి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, అక్కడ ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో మూడు పరుగులే చేయడంతో పాటు జట్టు యాజమాన్యం ఆగ్రహానికి గురయ్యాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ సమయంలో ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్ అందజేయాలని చెబితే.. తాను క్రికెట్ ఆడేందుకు వచ్చానని, ఇలాంటి పనులు చేయడానికి కాదని తేల్చిచెప్పడం గమనార్హం. ఈ వ్యక్తిత్వంతోనే నాలుగేళ్లు జట్టుకు దూరమయ్యాడని కూడా విశ్లేషకులు అంటారు. అనంతరం 1995-96 సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌లో రాణించి మళ్లీ 1996లో ఘనంగా సత్తా చాటాడు.
క్రికెట్ పుట్టినింటిపై చెరగని ముద్ర..
క్రికెట్ పుట్టినిల్లుగా అభివర్ణించే లార్డ్స్ మైదానంలో గంగూలీకి గొప్ప రికార్డులు ఉన్నాయి. ఆ ప్రతిష్ఠాత్మక మైదానంలో తనదైన ముద్ర వేశాడు. ఆ జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గంగూలీ 1996లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పుడు తొలుత ఒక వన్డే మ్యాచ్‌లో ఆడి విఫలమయ్యాడు. దాంతో తొలి టెస్టుకు అతడిని జట్టు యాజమాన్యం పక్కకు పెట్టింది. అయితే, రెండో టెస్టుకు ముందు అప్పటి బ్యాట్స్‌మన్ సిద్ధూ అనారోగ్యానికి గురవడంతో గంగూలీకి అనూహ్యంగా తుదిజట్టులో అవకాశం దక్కింది. దాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకొన్న అతడు లార్డ్స్ మైదానంలో 131 పరుగులు సాధించి ఇప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పాడు. ఆ ప్రతిష్ఠాత్మక మైదానంలో అరంగేట్రం టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంకా రికార్డు పుటల్లో దాదా నిలిచాడు. ఆపై ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మూడో టెస్టులోనూ శతకంతో మెరిసి వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన మూడో ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
టీమ్‌ఇండియాపై తనదైన ముద్ర..
ఇక 1999లో ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ గంగూలీ కొత్త రికార్డు సృష్టించాడు. అప్పుడు శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో సౌరభ్ (183; 158 బంతుల్లో 17x4, 1x6), ద్రవిడ్ (145; 129 బంతుల్లో 17x4, 1x6)తో కలిసి అప్పటికి ఆల్‌టైమ్ అత్యధిక రెండో వికెట్ భాగస్వామ్యం 318 నెలకొల్పాడు. అది అతడి కెరీర్‌లో మేటి ఇన్నింగ్స్‌గా నిలవడమే కాకుండా ప్రపంచకప్ చరిత్రలోనూ అతిగొప్ప ఇన్నింగ్స్‌గా చిరస్థాయిగా నిలిచిపోయింది. మరుసటి ఏడాదే టీమ్‌ఇండియా స్పాట్‌ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కోవడంతో.. ఆ తర్వాత అనుకోకుండానే కెప్టెనయ్యాడు. జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఈ క్రమంలోనే యువ క్రికెటర్లుగా అప్పుడప్పుడే కెరీర్ ఆరంభిస్తున్న సెహ్వాగ్, యూవీ, హర్భజన్, మహ్మద్ కైఫ్, జహీర్‌ఖాన్ లాంటి ఆటగాళ్లను మ్యాచ్ విన్నర్లుగా తీర్చిదిద్దాడు. వాళ్లతోనే 2001లో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలవడం.. 2002లో నాట్‌వెస్ట్ సిరీస్‌లో చొక్కా విప్పి లార్డ్స్ బాల్కనీలో సంబరాలు చేసుకోవడం, 2003 ప్రపంచకప్ ఫైనల్ వరకూ వెళ్లడం లాంటివి అతడి కెరీర్‌లో చిరస్థాయిలో నిలిచి ఉంటాయి.
ఛాపెల్‌ను తీసుకొచ్చి మరీ..
2005లో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా గ్రేగ్ ఛాపెల్‌ను తీసుకురావడంలో గంగూలీనే కీలక పాత్రపోషించాడు. విదేశీ కోచ్ అయితే బాగుంటుందని బీసీసీఐకి నచ్చజెప్పి మరీ ఛాపెల్‌ను తీసుకొచ్చాడు. అయితే, తర్వాతి కాలంలో అతడి వల్లే జట్టు నుంచి దూరం కావడం గమనార్హం. ఆ సమయంలో గంగూలీ బ్యాటింగ్‌లో పలు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో జట్టును నడిపించే స్థితిలో అతడు లేడని ఛాపెల్ బీసీసీఐకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో గంగూలీ కొద్ది నెలలు టీమ్ఇండియాకు దూరమయ్యాడు. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి తనదైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అప్పుడు దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లపై రాణించి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ క్రమంలోనే 2007 వన్డే ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు. కానీ, టీమ్‌ఇండియా గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. ఆపై పలువురు సీనియర్ ఆటగాళ్లకు ఛాపెల్‌తో పొసగకపోవడంతో కోచ్ బాధ్యతల నుంచి అతను తప్పుకొన్నాడు. అనంతరం పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గంగూలీ సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలి ద్విశతకం బాది మళ్లీ సత్తాచాటాడు. ఆ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్‌లో రెండో అత్యధిక 1,106 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే 2008లో ఆటకు గుడ్‌బై చెప్పి తర్వాత బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడిగా ఇప్పుడు బీసీసీఐ బాస్‌గా కొనసాగుతున్నాడు.
ఆసక్తికర విషయాలు..
గంగూలీ జీవితం బయోపిక్‌గా వెండితెరపైకి రానున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ పాత్ర ఎవరు పోషిస్తారు? క్రికెట్ దిగ్గజం సచిన్‌తో అతడి స్నేహం ఎలా చూపిస్తారు. అతడి చిన్ననాటి స్నేహితురాలు డోనాతో ప్రేమాయణం ఎలా ఉండనుంది, ముగింపు ఏ విధంగా ఉండనుందనే విషయాలపై ఆసక్తి పెరిగింది. మరి ఆ బయోపిక్ ఎప్పుడు వస్తుందో, నటీనటులెవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదీ చూడండి.. తెరపై గంగూలీ బయోపిక్.. దాదా ట్వీట్