India Lowest Score In T20 Chasing : వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్.. తొలి టీ20లో 4 పరుగుల తేడాతో ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. భారత్ ఈ మ్యాచ్‌లో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆట మధ్యలో అనూహ్యంగా పుంజుకున్న విండీస్ బౌలర్లు.. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి టీమ్ఇండియాను 145 పరుగులకే కట్టడి చేశారు. ఈ పరాజయంతో టీమ్ఇండియా యువ జట్టు పట్ల పలువురు సీనియర్లు అసహనం వ్యక్త పరుస్తున్నారు. మరి టీ20 ఛేజింగ్‌లో టీమ్ఇండియాను.. తక్కువ పరుగులకే కట్టడి చేసిన ప్రత్యర్థులేవరో ఇప్పుడు చూద్దాం.
1. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (2016)
2016 టీ20 ప్రపంచకప్ సూపర్ 10లో టీమ్ఇండియా కివీస్‌ను ఎదుర్కొంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. కట్టుదిడ్డంగా బంతులు సంధిస్తూ.. కివీస్‌ను 20 ఓవర్లలో 126 పరుగులకే కట్టడి చేశారు.
దీంతో భారత్ గెలుపు లాంఛనమే అనుకున్నారంతా. కానీ స్వల్ప లక్ష్య ఛేదనలో దిగిన టీమ్ఇండియా.. 39 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కాసేపు కెప్టెన్ ధోనీ (30) ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చెలరేగిన కివీస్ బౌలర్లు.. 18.1 ఓవర్లలో భారత్‌ను 79 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమ్ఇండియా టీ20 చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
2. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (2009)
2009 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్, తన ప్రత్యర్థిని 20 ఓవర్లకు 130/5 కు పరిమితం చేసింది. ఆ తర్వాత ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 118 పరుగులే చేయగలిగింది.
3. భారత్ వర్సెస్ జింబాబ్వే (2015)
2015 జింబాబ్వే పర్యటనలో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. అందులో తొలి టీ20లో భారీ విజయం నమోదు చేసిన టీమ్ఇండియా.. రెండో టీ20లో తేలిపోయింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు.. నిర్ణిత ఓవర్లకు 145/7 తో నిలిచింది. అనంతరం ఛేదనలో భారత్ ఓవర్లన్నీ ఆడి.. తొమ్మిది వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. దీంతో సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.
4. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (2010)
2010 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో తలపడ్డ కంగారూ జట్టు.. 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమ్ఇండియాను 17.4 ఓవర్లలో ప్రత్యర్థి ఆలౌట్ చేసింది. దీంతో భారత్ 49 పరుగుల తేడాతో ఓడింది.
5. భారత్ వర్సెస్ వెస్టిండీస్ (2023)
భారత్‌కు మరో పరాభవం ఈ పర్యటనలోనే ఎదురైంది. విండీస్ తొలి టీ20లో 149 పరుగులు చేసింది. కట్టుదిడ్డంగా బౌలింగ్ చేస్తూ.. ఆ చిన్న స్కోరును కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణిత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి.. 145 పరుగులే చేయగలిగింది.