ఈసారి ఎలాగైనా కప్పును ముద్దాడాలని కసితో ఉంది టీమ్ఇండియా. అందుకోసం ఏ చిన్న అవకాశాన్ని జారవిడవటం లేదు. తాజా ప్రపంచకప్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం కోసం అన్ని రకాలుగా సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం చిన్నచిన్న విషయాల్లోనూ అప్రమత్తంగా ఉంటోంది. జట్టులో తోటి సభ్యుల అవసరాల కోసం మిగిలిన ఆటగాళ్లు త్యాగాలు చేస్తున్నారు. తాజాగా అటువంటి నిర్ణయం ఒకటి వెలుగులోకి వచ్చింది. టీమ్ ఇండియా కోచ్, జట్టు కీలక సభ్యులు కొందరు తమకు కేటాయించిన సౌకర్యాలను బౌలర్లకు ఇచ్చారు. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమకు ఇచ్చిన బిజినెస్ క్లాస్ సీట్లను బౌలర్లు మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, పాండ్యాకు ఇచ్చారు. టోర్నికి ముందే దీనికి సంబంధించి జట్టు నిర్ణయించుకొంది. బౌలర్లు మైదానంలో పూర్తిస్థాయిలో ప్రతిభ చూపాలంటే.. ఫీల్డ్ బయట వారి కాళ్లు, వెన్నెముకకు వీలైనంత విశ్రాంతి కల్పించాలని భావించారు. ఈ విషయాన్ని జట్టులోని సిబ్బంది ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టుకు నాలుగు బిజినెస్ క్లాస్ సీట్లు కేటాయిస్తారు. చాలా జట్లలో ఈ సీట్లను కోచ్, కెప్టెన్, సీనియర్ ఆటగాడు లేదా వైస్ కెప్టెన్, మేనేజర్‌కు కేటాయిస్తాయి. కానీ, భారత వ్యూహ బృందం మాత్రం ఆస్ట్రేలియాలో ప్రతి మూడు నాలుగు రోజులకోసారి విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని దృష్టిలోపెట్టుకొంది. ఈ నేపథ్యంలో జట్టులోని పేసర్లకు వీలైనంత సౌకర్యవంతమైన సీట్లను కేటాయించాలని నిర్ణయించింది. దీంతో సాధారణంగా జట్టులో బిజినెస్ క్లాస్ సీట్లను పొందేవారు.. వాటిని బౌలర్లకు వదులుకొన్నారు. టోర్నమెంట్ పూర్తయ్యే నాటికి జట్టు మూడు టైమ్ జోన్లలో 34,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో స్థానిక విమాన ప్రయాణాలే కనీసం నాలుగైదు గంటలు ఉంటాయి.
ఇదీ చూడండి: IPL 2023: ఆ ఆటగాళ్లకు గుడ్‌బై చెప్పనున్న సన్‌రైజర్స్.. లిస్ట్ రెడీ చేసిన కావ్య!