KKR Captain Shreyas Iyer: టీమ్‌ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై సహచరుడు శ్రేయస్ అయ్యర్ ప్రశంసల జల్లు కురిపించాడు. మైదానంలో రాహుల్ ప్రశాంత స్వభావం, చాలా సహజంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తనకెంతో నచ్చాయని అన్నాడు. అయ్యర్.. రాహుల్ నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ ఆడాడు. "తన నాయకత్వంలో ఆడడం ఓ మంచి అనుభవం. అతడు అసాధారణ ఆటగాడు. మైదానంలో, జట్టు సమావేశాల్లో రాహుల్ ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే తీరు గొప్పగా ఉంటుంది. ఆటగాళ్లకు చాలా మద్దతిస్తాడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు. రాహుల్ మైదానంలో సమయానికి తగ్గట్లు అలవోకగా నిర్ణయాలు తీసుకుంటాడు. అతడి సారథ్యంలో ఆడడాన్ని చాలా ఆస్వాదించా" అని ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త సారథిగా బాధ్యతలందుకోనున్న శ్రేయస్ చెప్పాడు. దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో శ్రేయస్ మూడు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. "నాకు అతడు మూడు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇచ్చాడు. అంతకుముందు కెప్టెన్లెవరూ అలా చేయలేదు. అందుకే అతడు నా ఫేవరెట్ కెప్టెన్" అని శ్రేయస్ అన్నాడు.
ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా..
KKR Captain Shreyas Iyer: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు సారథిగా ఎంపికైన శ్రేయస్ అయ్యర్.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమని తెలిపాడు. మెగా వేలంలో శ్రేయస్‌ను కేకేఆర్ రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. 2020 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. "క్రికెట్‌లో ఒకరు పవర్ హిట్టింగ్ చేస్తున్నప్పుడు మరొకరు అండగా నిలవాల్సి ఉంటుంది. అయితే డిఫెన్సివ్‌గా ఉండే ఆటగాడు కూడానూ భారీ షాట్లు ఆడాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే పరిస్థితులను బట్టి బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకరిద్దరి మీదనే కాకుండా జట్టుగా ఆడి మ్యాచ్‌లను గెలిపించుకోవాలి" అని కేకేఆర్ యూట్యూబ్ ఛానెల్‌తో శ్రేయస్ వ్యాఖ్యానించాడు. జట్టులోని ఆటగాళ్లందరూ బాధ్యతగా ఉండి మ్యాచ్‌లో గెలిచేందుకు కృషి చేయాలే తప్ప ఒక్కరి మీదనే ఆధారపడకూడదని స్పష్టం చేశాడు.
బ్యాటింగ్ ఆర్డర్‌కు సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవసరానికి తగ్గట్టుగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తానని శ్రేయస్ తెలిపాడు. "వ్యక్తిగతంగా నాకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమంటే ఇష్టం. అందుకే నా స్థానం నంబర్ 3గా భావిస్తా. చాలా కాలంగా ఆ స్థానంలోనే బ్యాటింగ్ చేస్తూ ఉన్నా. అయితే జట్టు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయమంటే దానికి నేను సిద్ధం. అలానే కేకేఆర్ జట్టులోని ఆటగాళ్లలో ఉండే దూకుడు, బెరుకులేనితనం లక్షణాలు నాకెంతో ఇష్టం. తొలి బంతి నుంచే పైచేయి సాధించేందుకు మా ప్లేయర్లు దూకుడుగా ఉంటారు. నేను కూడా అదే మైండ్‌సెట్‌తో ఉండటం కలిసొచ్చే అంశం. బ్యాటర్‌గా, జట్టు సారథిగా అదే తీవ్రతతో ఆడతా" అని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.
ఇదీ చూడండి: భారత్-లంక పింక్ బాల్ టెస్టు.. పిచ్‌కు దారుణమైన రేటింగ్!