Kieron Pollard Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఆదరణ మరింత ఎక్కువైంది. చాలా టోర్నీలు పుట్టుకొచ్చాయి. కరీబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్ ఇలా ప్రపంచ నలుమూలల చాలానే టీ-20 టోర్నీలు జరుగుతున్నాయి. భారత్ గురించి పక్కనబెడితే.. మిగతా దేశాల ఆటగాళ్లు ముఖ్యంగా వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ ప్లేయర్లు దాదాపు అన్ని టోర్నీల్లో భాగం అవుతుంటారు. ఈ క్రమంలోనే విండీస్ మాజీ స్టార్ క్రికెటర్, కెప్టెన్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. 600 టీ-20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. ప్రస్తుతం ది హండ్రెడ్ టోర్నమెంట్లో ఆడుతున్న ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్.. సోమవారం ఈ ఘనత సాధించాడు. ఈ లీగ్‌లో లండన్ స్పిరిట్స్ తరఫున ఆడుతున్నాడు పొలార్డ్. ఈ మైలురాయిని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాడు విండీస్ క్రికెటర్. సోమవారం జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై 11 బంతుల్లోనే ఒక ఫోర్, 4 భారీ సిక్సర్లతో 34 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్‌లో తన జట్టు 52 పరుగుల తేడాతో గెలిచింది.
మొత్తం ఇప్పటివరకు పొలార్డ్ 600 టీ-20 మ్యాచ్‌ల్లో 11,723 పరుగులు సాధించాడు. సగటు 31.34. అత్యధిక వ్యక్తిగత స్కోరు 104. ఒక సెంచరీ సహా 56 అర్ధసెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 309 వికెట్లు పడగొట్టడం విశేషం. 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం అత్యుత్తమం.
పొలార్డ్ వెస్టిండీస్ దేశీయ జట్టు ట్రినిడాడ్ అండ్ టొబాగో; ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్; బిగ్‌బాష్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్; బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా గ్లాడియేటర్స్, ఢాకా డైనమైట్స్; పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ; కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడీ స్టార్ క్రికెటర్.
600 టీ-20 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ దరిదాపుల్లోనూ పెద్దగా ఎవరూ లేరు. బహుశా ఈ రికార్డు చాలా రోజులపాటు ఇతడి పేరిటే ఉండే అవకాశం ఉంది. పొలార్డ్ తర్వాత వరుసగా విండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో(543), పాక్ ప్లేయర్ షోయబ్ మాలిక్(472), క్రిస్ గేల్(463), రవి బొపారా(426) ఉన్నారు. వీరి వయసు దాదాపు 40కి చేరువలో ఉంది. మాలిక్ మినహా అంతా ఇప్పటికే జాతీయ జట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరంతా మిగతా టోర్నీల్లో ఆడినా.. పొలార్డ్ కూడా ఆడుతున్నాడు కనుక ఇప్పట్లో పొలార్డ్ రికార్డ్ చెక్కచెదరకపోవచ్చు.
ఇవీ చూడండి: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు పతకాల పంట.. మన 'బంగారాలు' వీరే..