దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టీ20 క్రికెట్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. సీఎస్‌ఏ ఛాలెంజ్ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రెవిస్ 57 బంతుల్లోనే 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. 35 బంతుల్లోనే శతకం సాధించిన అతను ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేయగా, 52 బంతుల్లో 150 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు.
గేల్ (175), ఫించ్ (172) తర్వాత టీ20 క్రికెట్‌లో ఇది మూడో అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. బ్రెవిస్ తుపాన్ ఇన్నింగ్స్ వల్ల నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది.
అతడితో పాటు మరో ఓపెనర్ పిళ్లై 52 పరుగులతో రాణించాడు. అనంతరం 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్స్ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులకే పరిమితమైంది. దీంతో టైటాన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. నైట్స్ బ్యాటర్లలో గిహాన్ క్లోయెట్(51) టాప్ స్కోరర్. టైటాన్స్ బౌలర్లలో నైల్ బ్రాండ్ 3, ఆరోన్ ఫాంగిసో 2, బ్రెవిస్, హర్మర్ తలో వికెట్ సాధించారు.
ఇదీ చూడండి: కోహ్లీ రూమ్ వీడియో లీక్‌పై స్పందించిన హోటల్.. ఏం చెప్పిందంటే?