Juhi Chawla Daughter: ఐపీఎల్ 2022 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని జూహీచావ్లా కుమార్తె జాహ్నవి ప్రత్యక ఆకర్షణగా నిలిచింది. షారుక్‌ఖాన్ కూతురు సుహానా, కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు జాహ్నవి ఈ వేలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుమార్లు ఆమె కెమెరా దృష్టిలో పడ్డారు. అయితే, తాజాగా జూహీచావ్లా తన కుమార్తెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని క్రికెట్ ప్రేమికులతో చెప్పింది.
"జాహ్నవి చిన్నప్పటి నుంచే క్రికెట్ చూడటం మొదలు పెట్టింది. అందులోని వ్యాఖ్యాతల మాటలను శ్రద్ధగా వింటూ, ఆటలోని పరిస్థితులను అర్థం చేసుకునేది. ఆమెకు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, మేం కుటుంబంతో కలిసి బాలీకి విహారయాత్రకు వెళ్లాం. అక్కడ హోటల్‌లో మేం కూర్చున్న చోట టేబుల్‌పై ఓ మ్యాగజైన్ కనిపించింది. అది ఒక టెలిఫోన్ డైరెక్టరీ అంత పెద్దగా ఉంది. అందులో ప్రపంచంలోని క్రికెటర్లందరి జీవిత కథలు, విజయాలు, రికార్డులు లాంటివి ఉన్నాయి. మేము హోటల్‌లో గడిపిన కొద్ది రోజుల్లోనే ఆమె పూర్తి పుస్తకం చదివేసింది. 12 ఏళ్ల అమ్మాయి అలా చేసేసరికి నేను ఆశ్చర్యపోయాను. సమయం గడిచేకొద్దీ ఆమెకు క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది" అని జూహీ చెప్పుకొచ్చారు.
"అలాగే క్రికెట్ గురించి మాట్లాడితే ఆమె ముఖం వెలిగిపోతుంది. ఆ సమయంలో చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. దీంతో క్రికెట్ విషయాలపై ఆమెకున్న పరిజ్ఞానం నన్ను ఆశ్చర్యానికి గురిచేసేది. ఇక మూడేళ్ల క్రితం ఐపీఎల్ వేలంలో తొలిసారి పాల్గొని.. ఈ అవకాశం దక్కించుకున్న పిన్న వయస్కురాలిగా నిలిచింది. అప్పుడు ఆమెకు 17 ఏళ్లే. ఇక గతేడాది ఆర్యన్, జాహ్నవి వేలానికి హాజరవ్వగా ఈసారి సుహానా వారితో చేరింది. మా సీఈవో వెంకీ మైసూర్ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. జాహ్నవిని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనడానికి, ఆమె అభిప్రాయాలు బలంగా వినిపించడానికి బాగా ప్రోత్సహిస్తారు. ఆయన నా కుమార్తెను ప్రేమగా 'కోచ్' అని పిలుస్తాడు. నిజానికి ఆమె ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ శిబిరంలో యువ ఇంటర్న్‌గా శిక్షణ పొందుతోంది. ఒక తల్లిగా నా కూతుర్ని చూసి సంతోషంగా ఉండటంతో పాటు గర్వంగానూ ఫీల్ అవుతున్నా. ఆమె చాలా తెలివైనది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. దేవుడి దయ వల్ల ఆమెకు నచ్చిన మార్గంలోనే పయనిస్తోంది" అని జూహీ భావోద్వేగభరితమైన పోస్టు చేశారు.
ఇదీ చూడండి : SRH Asst Coach Resign: సన్‌రైజర్స్ సహాయ కోచ్ రాజీనామా