ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ చివరిరోజు తనకు జరిగిన వింత అనుభవం గురించి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ తెలిపాడు. కివీస్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా తాను కాస్త ఆందోళన, నిరాశకు గురైనట్లు పేర్కొన్నాడు. దానిని అధిగమించడానికి బాత్రూంలో దాక్కున్నట్లు వెల్లడించాడు.
కీలకమైన ఈ మ్యాచ్‌లో జేమీసన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీయడమే కాకుండా.. రెండు ఇన్నింగ్స్‌లోనూ టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను దక్కించుకున్నాడు. బ్యాట్‌తోనూ మెరిసిన జేమీసన్.. తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 21 పరుగులు సాధించాడు.
"కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను డ్రెస్సింగ్ రూమ్ లోపల కూర్చొని టీవీలో చూస్తున్నాం. ఛేదన కొంత ఆలస్యంగా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో తెలియలేదు. వికెట్ పడినప్పుడు ఎలా చేస్తారో భారత అభిమానులు అలాగే లేచి టీమ్ఇండియాను ఉత్సాహపరుస్తున్నారు. కానీ, ఆ బంతి డాట్ కావడమో, లేకుంటే సింగిల్ రావడమో జరుగుతుంది. మ్యాచ్ సాగుతుంటే కఠినంగా అనిపించింది. టెన్షన్‌ను తట్టుకోలేక బాత్రూంలో దాక్కున్నాను."
-కైల్ జేమీసన్, కివీస్ ఆల్‌రౌండర్.
"చివరకు విలియమ్సన్-టేలర్ జంట ఆచితూచి ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇద్దరు అనుభవం గల బ్యాట్స్‌మెన్ సందర్భానుసారంగా ఆడారు" అని జేమీసన్ పేర్కొన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం కౌంటీ మ్యాచ్‌లో ప్రత్యక్షమయ్యాడు జేమీసన్. దీంతో విజయానికి సంబంధించి తాను సరిగా ఎంజాయ్ చేయలేకపోయానని తెలిపాడు. టీ20 మ్యాచ్‌కు సంబంధించి సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇదీ చదవండి: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే.. ఆ హక్కులు భారత్‌వే!