కోట్లాది మంది క్రికెట్ అభిమానుల్ని నిరాశపరుస్తూ మెగా లీగ్ ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. లీగ్‌తో సంబంధమున్న ప్రతి ఒక్కరి సంక్షేమమే తమకు ముఖ్యమంటూ లీగ్‌ను వాయిదా వేశారు. బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం, మైదాన సిబ్బందీ వైరస్ బారినపడటం, విదేశీ ఆటగాళ్లు రవాణ ఆంక్షల భయంతో లీగ్‌ను వీడుతుండటం వంటి కారణాలు టోర్నీ వాయిదాపడేలా చేశాయని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది లీగ్ జరుగతుందా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.
ప్రారంభంలోనే కరోనా
లీగ్ ప్రారంభంలోనే పలువురు ఆటగాళ్లకు కరోనా సోకింది. ఆర్సీబీ క్రికెటర్లు దేవదత్ పడిక్కల్, డేనియల్ సామ్స్, దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్, సీఎస్కే కంటెంట్ బృందంలోని వ్యక్తికి, ముంబయి వాంఖడే మైదాన సిబ్బందికి కరోనా సోకింది. దీంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ కఠిన బయోబబుల్, ఐసోలేషన్ నిబంధనల్ని అమలుపర్చిన పాలకమండలి.. టోర్నీని సజావుగా ప్రారంభించింది.
విదేశీ ఆటగాళ్ల దూరం
దేశంలో రోజురోజుకూ లక్షల్లో కేసులు నమోదవతున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లే మన దేశ పౌరులపై రవాణా ఆంక్షలు విధించారు. ఫలితంగా ఇక్కడి లీగ్‌లో పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒకరికొకరుగా వారి దేశానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆండ్రూ టై, కేన్ రిచర్డ్సన్, ఆడం జంపాతో పాటు పలువురు ఆటగాళ్లు లీగ్‌ను వీడారు.
మరోసారి కరోనా పడగ
ఇప్పటివరకు సగం టోర్నీ పూర్తయింది. మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. అభిమానులు వారి వారి జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అంతా సజావుగానే సాగుతుంది అనే సమయంలోనే మరోసారి కరోనా తెరపైకి వచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అలాగే సీఎస్కే బౌలింగ్ కోచ్ బాలాజీ, బస్ క్లీనర్‌కు వైరస్ సోకింది. తాజాగా సన్‌రైజర్స్‌కు చెందిన వృద్ధిమాన్ సాహా, దిల్లీ ఆటగాడు అమిత్ మిశ్రాకు వైరస్ సోకింది. దీంతో ఆటగాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న యాజమాన్యం లీగ్‌ను వాయిదా వేసింది.
యూఏఈకి నో!
కరోనా కారణంగా గతేడాది లీగ్‌ను యూఏఈలో నిర్వహించారు. అక్కడ కూడా కేసులు పెరిగినా లీగ్ మాత్రం సజావుగా సాగింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగి అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. ఈ ఏడాది కూడా కరోనా విజృంభించిన తరుణంలో యూఏఈలోనే మరోసారి టోర్నీ నిర్వహించాలని చూశారు. అందుకోసం ఐపీఎల్ పాలకమండలి.. బీసీసీకి విజ్ఞప్తి కూడా చేసింది. కానీ బోర్డు అందుకు నిరాకరించింది. ఈసారి భారత్‌లోనే టోర్నీ నిర్వహించాలని పట్టుబట్టింది.
బీసీసీఐ ముందున్న ఆప్షన్స్
1. ముంబయిలో పూర్తి టోర్నీ
ప్రస్తుతం ఆటగాళ్లు 10 రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ తర్వాత టోర్నీని పూర్తిగా ముంబయికి షిఫ్ట్ చేసి అక్కడ ఉన్న మూడు వేదికల్లో టోర్నీ నిర్వహించడం మొదటి ఆప్షన్. ఈ క్వారంటైన్ సమయంలోనే యాజమాన్యం అక్కడ బయోబబుల్ వాతావారణం సృష్టించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ లాక్డౌన్ కూడా విధించారు. దీంతో బీసీసీఐ అక్కడ టోర్నీ నిర్వించాలంటే ధైర్యం చేయాల్సి ఉంటుంది.
2. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ వాయిదా
జూన్‌లో ఐపీఎల్ నిర్వహించడం బీసీసీఐ ముందున్న మరో ఆప్షన్. కానీ ఇలా చేయాలంటే జూన్ 18న జరగాల్సి ఉన్న టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌ను జులైకి వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐసీసీ అనుమతి తీసుకోవాలి. అలాగే కరోనా కారణంగా వాయిదాపడిన పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహణ కూడా జూన్ 1 నుంచి 20 వరకు జరగనుంది. ఇందులో పలువరు విదేశీ ఆటగాళ్లు పాల్గొననున్నారు. దీంతో పీఎస్ఎల్ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ దృష్టిలో పెట్టుకోవాలి.
3. యూఏఈకి మార్చడం
జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లాండ్‌లో న్యూజిలాండ్-భారత్ మధ్య టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి అక్కడే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొననుంది ఇండియా. దీంతో ఆ నెలపాటు అక్కడే ఉండే వీలుంది. దీంతో భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌ను జూన్ మధ్యలో జరిగేలా ప్రీపోన్ చేస్తే ఆగస్టులో సిరీస్ ముగిసే అవకాశం ఉంటుంది. దీంత అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌కు ముందు కాస్త సమయం దొరుకుతుంది. ఈ సమయంలో భారత్ యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు ప్లాన్ చేయొచ్చు. కానీ ఇందుకోసం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.