టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు శుభవార్త! ఐపీఎల్ ఆడనప్పటికీ అతడికి పూర్తి వేతనం అందనుంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ఉండటం, మరికొన్ని నిబంధనలే ఇందుకు కారణం. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీసులో శ్రేయస్ అయ్యర్ భుజానికి గాయమైంది. ఫీల్డింగ్ చేస్తుండగా బంతి అందుకునేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో అతడి భుజం స్థానభ్రంశమైంది. ఏప్రిల్ 8న అతడికి శస్త్రచికిత్స జరగనుంది. దీంతో అతడు పూర్తిగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు.
శ్రేయస్ సేవలకు దిల్లీ క్యాపిటల్స్ రూ.7 కోట్లు చెల్లిస్తోంది. ఈ సీజన్‌కు దూరమవుతున్నప్పటికీ పూర్తి వేతనం అతడికి ఇవ్వాల్సి ఉంటుంది. బీసీసీఐ ఆటగాళ్ల బీమా విధానం వల్లే శ్రేయస్ పరిహారం పొందనున్నాడు. 2011లో వచ్చిన ఈ విధానం ప్రకారం.. గాయం లేదా ప్రమాదం వల్ల ఐపీఎల్ సీజన్‌కు దూరమైనా పూర్తి వేతనం చెల్లించాలి. అంతేకాకుండా టీమ్ ఇండియాకు ఆడుతూ గాయపడ్డా ఈ విధానం వర్తిస్తుంది.
దిల్లీకి శ్రేయస్ అయ్యర్ కీలకమైన ఆటగాడు. అతడు సారథ్యం చేపట్టాకే ఆ జట్టు రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. గతేడాది రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటి వరకు లీగులో 79 మ్యాచులు ఆడిన శ్రేయస్ 31.43 సగటుతో 2200 పరుగులు చేశాడు. గత సీజన్లో 34.60 సగటుతో 519 పరుగులు సాధించాడు. శ్రేయస్ లేకపోవడం వల్ల రిషభ్ పంత్‌కు దిల్లీ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఏప్రిల్ 10న ఆడనుంది దిల్లీ.