Sehwag Suggests MI: ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ హ్యాట్రిక్ ఓటములు ఎదుర్కొంది. బౌలింగ్ వైఫల్యంతో వరుసగా ఓడిపోతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పేసర్ బుమ్రాకు సహకరించేవారే లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య, కౌల్టర్-నైల్‌ను భర్తీ చేసే ఆటగాళ్లు జట్టులో ఎవరూ లేరని అంటున్నారు. విదేశీ ప్లేయర్లలో డేనియల్ సామ్స్, టైమల్ మిల్స్.. భారత్ నుంచి బాసిల్ థంపి ఎలెవన్‌లో ఉంటున్నప్పటికీ అది ప్రయోజనం చేకూర్చట్లేదని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ అంశంపై మాట్లాడాడు. జయ్‌దేవ్ ఉనద్కత్ సహా బెంచ్‌లో ఉన్న కొందరిపై దృష్టిసారించాలని యాజమాన్యానికి సూచించాడు.
''గతేడాది వరకు ఎవరైనా ప్రధాన బౌలర్ సరైన ప్రదర్శన చేయకున్నా, వారు మ్యాచ్‌కు దూరమైనా.. నాథన్ కౌల్టర్-నైల్ వంటి కొందరు కీలక పాత్ర పోషించేవారు. కానీ ఇప్పుడు ముంబయి బెంచ్ చూస్తే.. ఎవరినో తీసుకోవాలో స్పష్టత లేదు. మయాంక్ మార్కండే, జయ్‌దేవ్ ఉనద్కత్, మెరెడిత్, అర్షద్ ఖాన్‌కు ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. ఇంకా సంజయ్ యాదవ్, అర్జున్ తెందుల్కర్, హృతిక్ షోకీన్.. వీరితో సామ్స్, థంపిని భర్తీ చేయొచ్చు.''
- సెహ్వాగ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
అయితే వీరందరిలోకెల్లా మంచి అనుభవం ఉన్న ప్లేయర్ ఉనద్కత్‌ను మంచి ఎంపికగా సూచించాడు సెహ్వాగ్. గతంలో పుణెకు ఆడిన సమయంలో అతడు మంచి ప్రదర్శన చేశాడని గుర్తుచేశాడు. పవర్‌ప్లేలో 3 ఓవర్లు వేసే బౌలర్ ప్రస్తుతం ముంబయికి లేరని, బుమ్రాతో పవర్‌ప్లేలో అన్ని ఓవర్లు వేయించలేరని అన్నాడు. 'బుమ్రాకు మంచి సహకారం అందించాలంటే.. అది ఉనద్కతే' అని వీరూ సెలవిచ్చాడు.

2017 ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు ఆడిన ఉనద్కత్ హ్యాట్రిక్ సహా 24 వికెట్లు తీశాడు. అయితే.. ఇలాంటి ప్రదర్శన మరోసారి చేయలేదు. 2018లో రాజస్థాన్ రాయల్స్.. అతడిని రూ. 11.5 కోట్లు పెట్టి కొనుక్కున్నా అంతలా ఆడలేకపోయాడు ఉనద్కత్. గతేడాది వరకు అదే జట్టుకు కొనసాగాడు. ఈసారి మాత్రం రూ. 1.3 కోట్లకు ముంబయి దక్కించుకుంది. ముంబయి ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడగా.. అన్నీ ఓడిపోయింది. ఉనద్కత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఇవీ చూడండి: అసలే వరుస ఓటముల బాధలో దిల్లీ.. ఇప్పుడు కెప్టెన్ పంత్‌కు..