హోరాహోరీ పోరుపై మాట్లాడేందుకు తన వద్ద మాటల్లేవని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్ అన్నాడు. ఎక్కువ పరుగులు ఇస్తున్నప్పటికీ తన జట్టుపై విశ్వాసం వీడలేదని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. ఒత్తిడి చంపేస్తున్నా ఆఖరి ఓవర్లో 6 బంతుల్ని సులభంగా వేయాలని నిర్ణయించుకున్నట్టు యువ పేసర్ అర్షదీప్ వెల్లడించాడు. సోమవారం మ్యాచ్ తర్వాత వీరు మాట్లాడారు. పంజాబ్ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 217/7 పరుగులు చేసింది.
దురదృష్టవశాత్తు ఓడిపోయాం..
"నా వద్ద మాటల్లేవ్. లక్ష్యాన్ని దాదాపుగా సమీపించాం. దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఆద్యంతం బాగా ఆడాను.. కానీ ఆఖరి బంతిని మాత్రం సిక్సర్‌గా మలచలేకపోయాను. ఆట సాగే కొద్ది పిచ్ మెరుగ్గా అవుతున్నట్టు అనిపించింది. దాంతో లక్ష్యం ఛేదిస్తామనే నమ్మకం కలిగింది. నా ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో బంతిని చక్కగా టైమింగ్ చేశాను. తొలుత బౌలర్లను గౌరవించి సమయం తీసుకున్నా. లయ అందుకొనే వరకు సింగిల్స్ తీశాను. ఆ తర్వాత నా సహజ శైలిలో షాట్లు బాదేశాను. బంతిని చూడగానే స్పందించడం నా అలవాటు. కొన్నిసార్లు వికెట్ పోగొట్టుకుంటాను. ఏదేమైనా విశ్వాసంతో ఆడతాను. టాస్ వేసిన నాణెం బాగుంది. అందుకే జేబులో వేసుకున్నా. తీసుకోవచ్చా అని రిఫరీని అడిగితే వద్దన్నాడు" అని సంజు శాంసన్( 119; 63 బంతుల్లో 12×4, 7×6) మ్యాచ్ అనంతరం తెలిపాడు.
ఇదీ చదవండి: తెవాతియా అద్భుత క్యాచ్.. పరాగ్ చిత్రమైన బంతి
నమ్మకం కోల్పోలేదు..
"జట్టుపై నమ్మకం కోల్పోలేదు. ఒకట్రెండు వికెట్లు పడితే తిరిగి పుంజుకుంటామని తెలుసు. నేను ఆడటం వల్లే ఆట సుదీర్ఘంగా సాగింది. కానీ ఫీల్డింగ్‌లో మేం కొన్ని క్యాచులు వదిలేశాం. 11-12 ఓవర్ల వరకు బాగానే బౌలింగ్ చేశాం. మేమిందుకు అలవాటు పడ్డాం. ఇది మాకేం కొత్త కాదు. ఈ విజయం జట్టుగా మమ్మల్ని మరింత దగ్గర చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ బాగానే చేశాం. అయితే బౌలర్లు సరైన ప్రాంతాల్లో నిలకడగా బంతులు వేయలేదు. కానీ వారు నేర్చుకుంటారు. ఎందుకంటే వారిలో ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయి. వారికి అండగా ఉంటాం. హుడా అద్భుతంగా ఆడాడు. అలాంటి నిర్భయ ఇన్నింగ్స్‌లే ఐపీఎల్ కోరుకునేది. గేల్, హుడా బాగా ఆడారు. ఒత్తిడిని ఆస్వాదిస్తాడు కాబట్టే అర్షదీప్‌కు కీలక ఓవర్లు ఇస్తాను. పోటీపడేందుకు అతడు ఇష్టపడతాడు. అతడి నైపుణ్యాలపై నాకు గురి ఎక్కువ" అని రాహుల్( 91; 50 బంతుల్లో 7×4, 5×6) పేర్కొన్నాడు.
ఆఫ్‌సైడ్‌కు దూరంగా..
"ఆఖరి ఓవర్ కన్నా ముందు పిచ్ వేగంగా అనిపించింది. ఆ తర్వాత సహకరించింది. ఆఖరి ఆరు బంతుల్ని ఆఫ్‌సైడ్ దూరంగా విసరాలన్నది ప్రణాళిక. సంజు శాంసన్‌కు యార్కర్లు వేసేందుకు ప్రయత్నించా. అలాంటప్పుడు అతడు బౌండరీలు మాత్రమే కొట్టగలడు! అతడో సిక్సర్ బాదినా అదే ప్రణాళికను అమలు చేశాం. మా కోచింగ్ బృందం, కెప్టెన్ నాకు అండగా నిలిచారు. నేనెలాంటి పాత్ర పోషించాల్సి ఉంటుందో సన్నాహక మ్యాచుల్లో వారు నాకు స్పష్టంగా చెప్పారు. దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీలో నా ఫామ్ బాగుంది. పోటాపోటీ మ్యాచులాడటం మాకు అలవాటే. ఏదేమైనా రెండు పాయింట్లు సాధించడం సంతోషంగా ఉందని" అర్షదీప్( 4-0-35-3) వెల్లడించాడు.
ఇదీ చదవండి: ఆఖరి ఓవర్లో శాంసన్ నిర్ణయం సరైనదే: లారా