ఐపీఎల్ 14వ సీజన్ తొలిపోరులో ముంబయి ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆఖరి బంతికి చేధించింది. డివిలియర్స్(48; 27 బంతుల్లో 4x4, 2x6), గ్లెన్ మాక్స్‌వెల్(39; 28 బంతుల్లో 3x4, 2x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరి ఓవర్‌లో డివిలియర్స్ రనౌటవ్వడంతో బెంగళూరు విజయానికి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే హర్షల్ పటేల్(4) మిగిలిన పని పూర్తి చేసి బెంగళూరుకు తొలి విజయం అందించాడు.
అంతకుముందు టాస్‌ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ (5/27) చెలరేగడంతో రోహిత్ టీమ్ భారీ స్కోర్ సాధించలేకపోయింది. క్రిస్‌లిన్ (49; 35 బంతుల్లో 4x4, 3x6), సూర్యకుమార్ యాదవ్(31; 23 బంతుల్లో 4x4, 1x6) టాప్ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలకమైన 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ(19; 15 బంతుల్లో 1x4, 1x6) అనవసర పరుగుకు యత్నించి ఆదిలోనే రనౌటయ్యాడు. తర్వాత లిన్, సూర్య స్వేచ్ఛగా ఆడి బెంగళూరు బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. దాంతో తొమ్మిది ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 83/1కి చేరింది.
కాగా, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జేమీసన్ విడదీశాడు. పదో ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్‌ను బోల్తా కొట్టించాడు. అతడు కీపర్ డివిలియర్స్‌కు చిక్కడంతో ముంబయి 94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కాసేపటికే లిన్ అర్ధశతకానికి ఒక్క పరుగు ముందు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. తర్వాత హార్దిక్ పాండ్య(13), ఇషాన్ కిషన్(28) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. చివర్లో పొలార్డ్(7), కృనాల్ పాండ్య(7) కూడా నిరాశపరిచారు. ఆఖరి ఓవర్‌లో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీసి ఒకే పరుగు ఇవ్వడంతో ముంబయి ఇన్నింగ్స్‌కు తెరపడింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ ఐదు.. సుందర్, జెమీసన్ చెరో వికెట్ తీశారు.
ఇదీ చదవండి:ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ పేసర్