ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఆర్సీబీ ముంబయి మ్యాచ్‌కు సర్వం సిద్ధమయ్యింది. కానీ ఇంతలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓ గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే టీమ్‌లోని స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వగా.. తాజాగా టాప్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కూడా అదే బాట పట్టాడు. అంతర్జాతీయ షెడ్యూలింగ్ కారణంగా ఐపీఎల్‌కు హసరంగ దూరమవ్వడం ఆర్సీబీకి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. అతడు ఏప్రిల్ 9 వరకు అందుబాటులో ఉండటం కష్టమని ఆర్‌సీబీ ప్రధాన కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. ఆదివారం ముంబయితో బెంగళూరు తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో హేజిల్‌వుడ్ స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ రీస్ టోప్లేను తీసుకున్నట్లు బంగర్ వెల్లడించాడు.
మరోవైపు ఆర్సీబీకి చెందిన మరో యంగ్ ప్లేయర్ రజత్ పటీదార్ కూడా సగం మ్యాచ్‌లకు హాజరు కాలేడు. ఇప్పటికీ అతడి గాయంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. కాగా, ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రం ముంబయితో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ విల్ జాక్స్ స్థానంలో కివీస్ ఆటగాడు బ్రాస్‌వెల్‌ను తీసుకుంటున్నట్లు తెలిపారు. సొంత మైదానంలో ఆడేందుకు ఆటగాళ్లంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని బంగర్ తెలిపారు.
ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో విరాట్ కోహ్లీ, ఫిన్ అలెన్, దినేశ్ కార్తిక్, సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లతో టైటిల్ గెలిచే దిశగా సాగాలని బెంగళూరు టీమ్ అభిమానులు ఆశిస్తున్నారు. గతేడాది ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ ఫామ్ కొనసాగిస్తే మాత్రం బెంగళూరుకు తిరుగుండదని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టోర్నమెంట్‌కు ఇక కేన్ 'మామ' దూరం..
శుక్రవారం చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయపడ్డ గుజరాత్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలాంకి తెలిపారు. "గాయం కారణంగా టోర్నమెంట్‌కు కేన్ దూరమౌతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. మరోసారి మైదానంలో ఆడాలని ఆశిస్తున్నాము" అని సోలాంకీ అన్నారు.
తదుపరి చికిత్స కోసం అతడు భారత్ నుంచి న్యూజిలాండ్‌కు పయనమవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేన్ స్థానంలో ఆడనున్న మరో ప్లేయర్ గురించి త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అయితే శుక్రవారం గాయపడ్డ కేన్‌ను చికిత్స్ కోసం ఆస్పత్రికి తరలించగా అతడి స్థానంలో గుజరాత్ టీమ్.. సాయి సుదర్శన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి పంపింది.