రవిచంద్రన్ అశ్విన్‌కు నాలుగో ఓవర్ ఇవ్వకపోవడం పొరపాటేనని దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అంగీకరించాడు. అతడెంతో పొదుపుగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నాడు. క్రిస్ మోరిస్‌కు తమ పేసర్లు సులువైన బంతులు వేశారని వెల్లడించాడు. యార్కర్లు వేసుంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. దిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఆఖరి ఓవర్లో ఛేదించి విజయం సాధించింది.
మ్యాచులో 3 ఓవర్లు వేసిన అశ్విన్ 14 పరుగులే ఇచ్చాడు. ఒక్క బౌండరీ కొట్టనివ్వలేదు. 54 బంతుల్లో 92 పరుగులు అవసరమైన క్రమంలో యాష్ మూడో ఓవర్ పూర్తి చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన అతడికి మరో ఓవర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై స్పందించాడు పాంటింగ్.
"మ్యాచుపై సమీక్ష చేసేటప్పుడు ఈ విషయం గురించి కచ్చితంగా మాట్లాడతా. యాష్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లు వేసి 14 పరుగులే ఇచ్చాడు. తొలి మ్యాచులో నిరాశపరిచినా ఈ పోరులో అదరగొట్టాడు. అతడికి తర్వాత బౌలింగ్ ఇవ్వాల్సింది. ఇది పొరపాటే."
-పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్ కోచ్
"క్రిస్ మోరిస్‌కు మేం కొన్ని సులువైన బంతులు విసిరాం. ఎక్కువ స్లాట్ బంతులు విసిరాం. అవసరమైన లెంగ్తుల్లో బంతులు వేయలేదు. నిజానికి అతడికి యార్కర్లు వేసుంటే పరుగులు చేసేవాడు కాదు. సరైన లెంగ్తుల్లో, వికెట్ల ఎత్తులో బంతులు వేసుంటే, వేగం తగ్గిస్తే బాగుండేది. కానీ మేం అలా చేయలేదు" అని పాంటింగ్ తెలిపాడు. 18 బంతులు ఆడిన మోరిస్ 4 సిక్సర్లు బాది 36 పరుగులతో అజేయంగా నిలిచాడు.