Prithvi Shaw IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో యువ క్రికెటర్లతో పాటు సీనియర్లు కూడా రెచ్చిపోతున్నారు. దిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీ షా మాత్రం తేలిపోయాడు. రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకూ సింగ్.. ఇలా యంగ్ ప్లేయర్లు ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. తద్వారా జాతీయ జట్టులోకి ప్రవేశించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక, పృథ్వీ షాను యశస్వి జైస్వాల్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పృథ్వీ షాపై న్యూజిలాండ్ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాళ్లతో పోటీ పడేందుకు షా చాలా కష్టపడాలను.. ఇప్పటికే అతడు చాలా వెనుకబడ్డాడని స్టైరిస్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో యువ ఆటగాళ్ల ట్రెండ్ కొనసాగుతోందని.. అయితే, పృథ్వీ షా అలాంటి పోటీకి దూరంగా ఉన్నాడని స్టైరిస్ అన్నాడు.
"పృథ్వీ షా తిరిగి ఫామ్‌లోకి రావాలంటే చాలా కష్టపడాలి. దేశవాళీ క్రికెట్‌లోకి భారీ పరుగులు సాధించాలి. అతడు తన ఆటతీరుపై మరింత కృషి చేయాలి. స్టైల్.. ఫిట్‌నెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి"
--స్కాట్ స్టైరిస్, న్యూజిలాండ్ జాతీయ జట్టు ప్లేయర్
prithvi shaw ipl 2023 total runs : ఈ సీజన్‌లో పృథ్వీ షా ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అన్నింట్లో కలిపి కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో జట్టులో స్థానం కోల్పోయాడు. పృథ్వి షాతో పాటు ఈ సీజన్‌లో మరో కొందరు ప్లేయర్లు కూడా పేలవ ప్రదర్శన చేస్తున్నారు. అందులో ఆర్సీబీ ప్లేయర్ దినేశ్ కార్తిక్, సీఎస్‌కే నుంచి మొయిన్ అలీ, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్లు ఆండ్రూ రస్సెల్, అంబటి రాయుడు ఉన్నారు.
అతడి ఆటన నన్ను ఆకర్షించింది : బ్రెట్ లీ
అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి ఆట తనను ఆకర్షించిందని కొనియాడాడు. "యశస్వి జైస్వాల్ అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. తప్పకుండా అతను భారత్ తరఫున చాలా ఏళ్లపాటు ఆడతాడు. అతని వైఖరి బాగుంది. ఈ తరహా ప్రదర్శనతో చివరివరకు టోర్నీలో రాణించాలి" అని బ్రెట్ లీ అన్నాడు. యశస్వి జైస్వాల్ ఈ సీజన్ లోనే సూపర్ సెంచరీ సాధించి.. జోస్ బట్లర్ రికార్డు (124 పరుగులు)ను సమం చేశాడు.