వచ్చే ఐపీఎల్ వేలానికి సంబంధించి గురువారం రాత్రి బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో తన పేరు లేకపోవడంపై వెటరన్ పేసర్ శ్రీశాంత్ స్పందించాడు. తనని ఎంపిక చేయకపోవడం పట్ల బాధగా ఉన్నా.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మరింత సానుకూలంగా ముందుకు సాగుతానని చెప్పాడు. తనపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెట్ ఆడేందుకు ఇప్పటికే 8 ఏళ్లు వేచి చూశానని.. అవసరమైతే మరిన్ని రోజులు ఎదురుచూస్తానని అన్నాడు.
'నాకింకా 38 ఏళ్లే.. క్రికెట్‌ను అంత తేలిగ్గా వదలను. మరింత ఎక్కువగా కష్టపడి వచ్చే ఏడాది ఆడేందుకు ప్రయత్నిస్తా. ఏదైనా అద్భుతం జరిగి అవకాశం వచ్చినా వదులుకోను. అందుకు క్రిస్‌గేలే ఉదాహరణ. 2011 సీజన్‌లో గేల్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ ఆ తర్వాత అతడు ఆర్సీబీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు' అని శ్రీశాంత్ గుర్తుచేశాడు.
శ్రీశాంత్ 2013 ఐపీఎల్ సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకొని జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే 2019లో సుప్రీంకోర్టు అతడి నిషేధ కాలాన్ని తగ్గించాలని బీసీసీఐని ఆదేశించడంతో ఏడేళ్లకు కుదించింది. గతేడాది సెప్టెంబర్‌తో ఈ నిషేధం పూర్తయింది. అనంతరం దేశవాళి క్రికెట్‌లో కేరళ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొని ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు ఐపీఎల్ వేలం కోసం రూ.75 లక్షల కనీస ధరకు దరఖాస్తు చేసుకోగా తుది జాబితాలో చోటు దక్కలేదు. మరోవైపు బీసీసీఐ ఈ సీజన్ కోసం 292 మందిని ఎంపిక చేసింది.
ఇదీ చదవండి: ఐపీఎల్లో ఆడాలని ఉంది.. కానీ...: రూట్