Mitchell Marsh COVID negative: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. దిల్లీ ఆటగాడు, ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు కొవిడ్ నెగెటివ్ వచ్చింది. అతడికి తొలుత యాంటీజెన్ పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. అనంతరం ఐసోలేషన్‌కు పంపి.. ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. ఇందులో నెగెటివ్ వచ్చిందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. బుధవారం దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపాయి.
IPL 2022 Covid outbreak: దిల్లీ ఆటగాళ్లు సోమవారమే పుణెకు బయల్దేరాల్సి ఉంది. అయితే మార్ష్ కరోనా బారిన పడటం వల్ల ప్రయాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ సైతం ఇదివరకు కొవిడ్ బారినపడ్డాడు. ప్రస్తుతం అతడు సైతం కరోనా నుంచి కోలుకున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారులు స్పష్టం చేశారు. మార్ష్‌కు కొన్ని లక్షణాలు కనిపించాయని, దీంతో టెస్టు చేయగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. కరోనా సోకక ముందు ఫిజియో ప్యాట్రిక్ వద్దే మిచెల్ మార్ష్ చికిత్స తీసుకున్నాడని, అతడితో సన్నిహితంగా ఉన్న కారణంగా కొవిడ్ వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.
'దిల్లీ క్యాపిటల్ బృందం ఈరోజే పుణెకు వెళ్లాల్సింది. కానీ కరోనా కారణంగా వీరందరినీ ఆగాలని కోరాం. ఆటగాళ్లు, సిబ్బంది తమ హోటల్ గదుల్లోనే ఉన్నారు. కరోనా నిబంధనల ప్రకారం ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నాం. నెగెటివ్ వచ్చిన వారు రేపు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు' అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ జట్టులోని సభ్యులకు ప్రతి ఐదు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. గత సీజన్లో ప్రతి మూడురోజులకు ఒకసారి టెస్టులు నిర్వహించేవారు. అయితే, ఫ్రాంఛైజీలు కోరుకుంటే ఎప్పుడైనా పరీక్షలు నిర్వహించుకునే సౌలభ్యం కల్పించింది బీసీసీఐ. తాజాగా దిల్లీ ఫిజియోకు, ఆటగాడికి కరోనా సోకిందన్న వార్త తెలియగానే.. ఐపీఎల్ ఆగిపోతుందేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. కరోనా వల్ల గత సీజన్ రెండు భాగాలుగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ఇదీ చదవండి: ఫినిషర్‌గా అదరగొడుతున్న డీకే... మహీని గుర్తు తెచ్చేలా...