ఈసారి ఐపీఎల్ వేలంలో ఒక్క శ్రీలంక ఆటగాడినీ తీసుకోకపోవడంపై ఆ దేశ దిగ్గజాలు కుమార సంగక్కర, మహేలా జయవర్దనెే స్పందించారు. అయితే, వీరిద్దరూ భిన్న స్వరాలు వినిపించడం గమనార్హం. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సంగక్కర ఈ విషయంపై స్పందిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో లంక జట్టుకు కచ్చితమైన షెడ్యూల్ లేకపోవడమే ఆ జట్టు ఆటగాళ్లను తీసుకోకపోవడానికి ప్రధాన కారణమని చెప్పాడు.
"లంక ప్రీమియర్ లీగ్, శ్రీలంక జట్టులో కొందరు అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఆ జట్టు అంతర్జాతీయ షెడ్యూల్ ఊహించలేని విధంగా ఉంది. ఆటగాళ్లు ఎంతకాలం ఐపీఎల్‌లో ఉంటారో అంచనా వేయడం కష్టం. ఐపీఎల్ మధ్యలో వెళ్లాల్సి వస్తే ఆయా ఫ్రాంఛైజీలకు ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఈసారి ఐపీఎల్‌లో శ్రీలంక ఆటగాళ్లను చూడలేకపోతున్నాం. బాగా ఆడే సత్తా వాళ్లకు లేదని, అందుకే తీసుకోలేదనే అభిప్రాయం సరికాదు."
- కుమార సంగక్కర, శ్రీలంక మాజీ కెప్టెన్
ఇదే విషయంపై ముంబయి ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేలా జయవర్దనే మాట్లాడుతూ.. "లంక ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకపోవడం నిరాశ కలిగించిందని చెప్పాడు. కొందరు ఆటగాళ్లను తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నా.. ఫ్రాంఛైజీల అవసరాలకు తగ్గట్లు వారు లేరన్నాడు. విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయంలో తక్కువ మందిని మాత్రమే తీసుకునే వీలుందని, అందులోనూ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లవైపే ఎక్కువగా మొగ్గు చూపారని చెప్పాడు. ఈ విభాగాల్లో లంక ఆటగాళ్లు వెనుకబడ్డార"ని జయవర్దనే స్పష్టం చేశాడు.
ఇదీ చూడండి: 'క్రీడాకారుడికి గుర్తింపు వచ్చేది అలానే!'