ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు బయటకు వచ్చారు. ఈ సీజన్ వారిలోని ప్రతిభను వెలికితీసేలా చేసింది. అలా వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ రింకూ సింగ్. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న ఈ ప్లేయర్.. మైదనంలో అద్భుత ప్రదర్శన ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. పేదరికాన్ని జయించి అతడు ఇంత వరకు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ 25 ఏళ్ల ప్లేయర్ ప్రస్తుతం ఆర్థికంగా కాస్త స్థిరపడ్డాడు. అయితే ఐపీఎల్‌లో ఇంకా భారీ ఆర్జిస్తున్న ఆటగాడిగా అయితే ఎదగలేదనే చెప్పాలి. అయినప్పటికీ.. తనలా కలలు సాకారం చేసుకోవాలనుకుంటున్న వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వర్ధమాన క్రికెటర్ల కోసం అలీగఢ్‌లో హాస్టల్ నిర్మిస్తున్నాడు.
దీనికోసం రూ.50 లక్షలు వెచ్చిస్తున్నాడు. "ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ ఆటగాళ్ల కోసం హాస్టల్ నిర్మించాలని రింకూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇప్పుడు అతను ఆర్థికంగా నిలదొక్కుకోవడం వల్ల ఓ హాస్టల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడు." అని అలీగఢ్‌కు చెందిన రింకూ చిన్ననాటి కోచ్ జాఫర్ తెలిపారు. జిల్లా క్రికెట్ సంఘానికి చెందిన 15 ఎకరాల స్థలంలో అలీగఢ్ క్రికెట్ స్కూల్, అకాడమీ నడిపిస్తున్నాడు జాఫర్. ఇప్పుడు రింకూ అక్కడే ఓ హాస్టల్‌ను నిర్మిస్తున్నాడు.
"మూడు నెలల కింద ఈ హాస్టల్ కట్టే పని మొదలైంది. ఇందులో మొత్తం 14 గదులు ఉంటాయి. ఒక్కో గదిలో నలుగురు ట్రైనీలు వరకు బస చేసే సౌకర్యం ఉంది. ఇక్కడే ఉన్న క్యాంటీన్‌లో వాళ్లు ఆహారం తినొచ్చు. మొత్తం హాస్టల్ నిర్మాణానికి సుమారు రూ.50 లక్షల ఖర్చవుతుంది. మొత్తం ఖర్చును అతనే భరిస్తున్నాడు" అని జాఫర్ పేర్కొన్నారు. ఇంకో నెల రోజుల్లో హాస్టల్ నిర్మాణం పూర్తవుతుందని, ఐపీఎల్ పూర్తయ్యాక రింకూ దీన్ని ప్రారంభిస్తాడని అన్నారు.
ఐపీఎల్ - 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో కోల్‌కతా ఆడిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యచ్ చివరి ఓవర్లో టీమ్‌కు 29 పరుగులు అవసరమున్న సమయంలో మైదనంలో ఉన్న రింకూ.. ఐదు భారీ సిక్సర్లతో సంచలనం సృష్టించాడు. అలా 21 బంతుల్లో 48 పరుగులను స్కోర్ చేసి టీమ్‌ను విజయ పథంలోకి నడిపించాడు. దీంతో సోషల్ మీడియా అంతా ఇతని గురించే చర్చలు మొదలయ్యాయి. నెటిజన్లందూరూ ఈ 25 ఏళ్ల ప్లేయర్‌పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇక రింకూ ఆ తర్వాత ఆడిన మ్యాచుల్లోనూ నిలకడగా రాణిస్తూ అంచెలంచలుగా ఎదుగుతున్నాడు.