IPL 2023 Jofra Archer : ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై టీమ్ఇండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబయి ఇండియన్స్ జట్టుకు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు. ముంబయి అతడిపై వెచ్చించిన ఒక్క రూపాయికి కూడా ఆర్చర్ న్యాయం చేయలేదని ఆరోపించాడు. అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
అయితే 2022 ఐపీఎల్ సీజన్ వేలంలో భాగంగా రూ.8 కోట్లు పెట్టి ముంబయి ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న ఆర్చర్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిసినా అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 లీగ్ ద్వారా ఈ ఏడాది ఆరంభంలో టీ20 క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టిన ఆర్చర్.. ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు ఆడాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి తిరిగి వచ్చాడు. ఎన్నో అంచనాలతో ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అతడు 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు తీశాడు. తర్వాత గాయం తిరగబెట్టడంతో మే 9న స్వదేశానికి వెళ్లిపోయాడు.
ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ జోఫ్రా ఆర్చర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడ్ డేకు రాసిన కాలమ్‌లో.. "జోఫ్రా ఆర్చర్ వల్ల ముంబయి ఇండియన్స్ ఎలాంటి అనుభవం చవిచూసిందో తెలుసు కదా! ఈ సీజన్ నుంచి మాత్రమే అతడు అందుబాటులో ఉంటాడని తెలిసినా గాయపడిన అతడిని కొనుగోలు చేసింది. అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. కానీ ప్రతిఫలంగా వారికి ఏం లభించింది? అతడు 100 శాతం ఫిట్‌నెస్ సాధించకలేకపోయాడు. కనీసం ఈ విషయం గురించి ముందే ఫ్రాంఛైజీకి సమాచారం ఇవ్వాల్సింది. అపుడైనా వాళ్లకు.. అతడి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేమని తెలిసేది. టోర్నీ మధ్యలో చికిత్స కోసమని స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఈసీబీ స్వయంగా చెప్పింది. నిజానికి ఈసీబీ కంటే ముంబయి ఫ్రాంఛైజీనే ఆర్చర్‌కు ఎక్కువ మొత్తం చెల్లిస్తోంది. కానీ అతడు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించాడు. యూకేకు తిరిగి వెళ్లినపుడే ఫ్రాంఛైజీ పట్ల అతడి నిబద్ధత ఎలాంటిదో అర్థమైంది" అని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అసలు ఆర్చర్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా నష్టమేమీ లేదని పేర్కొన్నాడు.
మరోవైపు, జోఫ్రా ఆర్చర్ స్థానంలో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను తీసుకున్న ముంబయికి బౌలింగ్ కష్టాలు తీరడం లేదు. ఆ జట్టు బౌలింగ్ కష్టాలను జోర్డాన్ తీర్చలేకపోతున్నాడు. ఆర్చర్‌కు రిప్లేస్మెంట్లో జోర్డాన్‌ను తీసుకొని మే 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో బరిలో దింపింది. గత మూడు మ్యాచ్‌ల్లో మొత్తంగా 12 ఓవర్లు బౌలింగ్ చేసిన జోర్డాన్ ఏకంగా 132 పరుగులు సమర్పించుకుని కేవలం ఒక్కటంటే ఒక్కటే వికెట్ పడగొట్టాడు. ఇలాంటి పేలవమైన బౌలింగ్‌తో ఫైనల్‌కు ఎలా వెళ్లేది? అంటూ ముంబయి ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.