ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ సీజన్‌లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది పంజాబ్ టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ.. ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులను స్కోర్ చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సికిందర్ రజా (57; 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించగా... చివర్లో షారూక్ ఖాన్ (23; 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మాథ్యూ షార్ట్ (34; 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. హర్‌ప్రీత్ సింగ్ భాటియా (22) పరుగులు చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో యుధ్‌వీర్ సింగ్ 2, మార్క్ వుడ్ 2, రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు.
అయితే లఖ్‌నవూ నిర్దేశించిన 160 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అథ్వారా టైడే పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. రెండో బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్ (4) కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు. యుధ్‌వీర్ సింగ్ వేసిన 2.2వ బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. ఇంప్టాక్ట్ ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ బాదిన మాథ్యూ షార్ట్ (34).. చివరి బంతికి స్టాయినిస్‌కు చిక్కాడు. హర్‌ప్రీత్ సింగ్ భాటియా (22) ఔటయ్యాడు. కృనాల్ పాండ్య వేసిన 11 ఓవర్‌లో చివరి బంతికి యుధ్‌వీర్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. రవి బిష్ణోయ్ వేసిన 14.3 ఓవర్‌కు సామ్ కరన్ (6) ఔటయ్యాడు.
అంతకుముందు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ జట్టుకు ఓపెనర్లు కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్ శుభారంభం చేశారు. నిలకడగా ఆడుతున్న రాహుల్, మేయర్స్ జోడీని హర్‌ప్రీత్ బ్రార్ విడదీశాడు. అతడు వేసిన 7.4 ఓవర్‌కు కైల్ మేయర్స్ (29) హర్‌ప్రీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. సికిందర్ రజా తన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. అతడు వేసిన 8.4 ఓవర్‌కు దీపక్ హుడా (2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కృనాల్ పాండ్య (18) ఔటయ్యాడు. రబాడ వేసిన 14.2 ఓవర్‌కు షారూక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత లఖ్‌నవూ కీలకమైన వికెట్ కోల్పోయింది. రబాడ వేసిన 14.3 ఓవర్‌కు నికోలస్ పూరన్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
అనంతరం క్రీజులోకి దిగిన స్టాయినిస్(15) సామ్ కరన్ వేసిన 18 ఓవర్‌లో ఐదో బంతికి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ఆరంభం నుంచి రాణించిన కేఎల్ రాహుల్ (74) ఔటయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19 ఓవర్‌లో రెండో బంతికి ఫోర్ బాదిన రాహుల్.. నాలుగో బంతికి నాథన్ ఎల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సామ్ కరన్ వేసిన 20 ఓవర్‌లో మూడో బంతికి కృష్ణప్ప గౌతమ్ (1) సికిందర్ రజాకు చిక్కాడు. తర్వాతి బంతికే యుద్విర్ సింగ్ (0) బౌండరీ లైన్ దగ్గర షారూక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. రవిబిష్ణోయి్(3*) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా లఖ్‌నవూ 159 పరుగులు సాధించింది.
రాహుల్ అరుదైన ఘనత..
ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ సారథి కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 74 పరుగులు సాధించాడు. లీగ్ చరిత్రలో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు, ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మైలు రాయని అందుకున్న ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. 2023 సీజన్‌లో రాహుల్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ.