IPL 2023 Rinku singh : ఐపీఎల్ సీజన్ 16లో రింకు సింగ్ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా.. గతనెల గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్లో రింకు ఏకంగా ఐదు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. నిజానికి 2018లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన రింకు సింగ్‌కు అప్పట్లో పెద్దగా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. అయితే తాజా సీజన్లో తనకు వచ్చిన అవాకాశాల్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్ననాడు.
ఇక శనివారం నాటి మ్యాచ్‌లో గెలుపుతో సీజన్‌ను ముగిద్దాం అనుకున్న కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. ఓ వైపు వికెట్లు పడుతుంటే జట్టును గెలిపించేందుకు రింకు ఎంతో కృషి చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. మరో ఎండ్‌లో అతడికి మద్దతు కరవైంది. అయితే 33 బంతుల్లో 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రింకు.. మ్యాచ్ ఓడిపోవటం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.
లఖ్‌నవూతో మ్యాచ్ అనంతరం రింకు మీడియాతో మాట్లాడుతూ.. ' ఏ ఆటగాడు అయిన ఒక సీజన్లో రాణిస్తే గొప్పగా భావిస్తారు. నేను ఇప్పుడే టీమ్ఇండియాలో చోటు గురించి ఆలోచించటం లేదు. నా ఆట పట్ల మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. గతేడాది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్(15 బంతుల్లో40 పరుగులు) చూసినప్పటి నుంచి ప్రజలు నన్ను గుర్తిస్తున్నారు. ఈ సీజన్లో గుజరాత్ పై ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది కోల్‌కతాను గెలిపించినప్పటి నుంచి నన్ను ఇంకా ఏక్కువ మంది ఆదరిస్తున్నారు. నన్ను గౌరవించే వారు సైతం పెరిగారు. ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ నా డైలీ రొటిన్ను కొనసాగిస్తాను. క్రికెట్ ప్రాక్టీస్, ఫిట్నెస్ కోసం జిమ్‌లో ఎక్కువ సమయాన్ని గడుపుతాను.నేను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నా. ఈ అనుభవం చాలా గొప్ప అనుభూతిని ఇస్తోంది' అని అన్నాడు.
కాగా, దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ మంచి పేరు సంపాందించుకున్న రింకూ.. ఉత్తర్‌ప్రదేశ్ తరపున ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడు. 2018-19 రంజీ సీజన్ గ్రూప్ దశలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రింకు 59.25 సగటున,149 స్ట్రయిక్ రేట్‌తో 474 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడి 12 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. డేంజర్ మ్యాన్ అండ్రీ రస్సెల్ దారుణంగా విఫలమయ్యాడు.