IPL 2022: టీ20 లీగ్‌లో ఈసారి వింత పరిస్థితి నెలకొంది. గతంలో ఛాంపియన్లుగా నిలిచిన కొన్ని జట్లు పేలవ ప్రదర్శన కొనసాగిస్తుండగా.. కొత్త జట్లతో పాటు మరికొన్ని టీమ్‌లు అదరగొడుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన జట్లు ఈ సారి అట్టడుగు స్థానాలకు పరిమితమవడానికి బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్‌బౌలర్లు రాణించకపోవడం వల్లే ఆ జట్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని అర్థమవుతోంది. మరి ఆ జట్లు ఏవి.. ఆ ఫాస్ట్‌బౌలర్లు ఎవరు అనేది దానిపై ప్రత్యేక కథనం.
ముంబయిని ముంచుతోంది.. ఫాస్ట్‌బౌలర్లే: టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ముంబయి జట్టు. అత్యధిక టైటిళ్లు (5) నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించిన ముంబయి.. ఈ సారి దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోతోంది. ఈ జట్టులోని ఫాస్ట్‌బౌలర్లు ధారాళంగా పరుగులిస్తూ వికెట్లు పడగొట్టడం లేదు. నేటితరం మేటి బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన జస్ప్రీత్ బుమ్రా కాస్త పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా వికెట్లు తీయడం లేదు. మిగతా బౌలర్లు నుంచి సరైన సహకారం అందకపోవడం వల్ల అతడు ఒత్తిడికి లోనవుతున్నాడు. గతంలో బుమ్రాకు తోడుగా ఉన్న ట్రెంట్ బౌల్ట్ ఈసారి జట్టులో లేడు. ఇది కూడా ముంబయి బౌలింగ్‌పై ప్రభావం చూపుతోంది. జయదేవ్ ఉనద్కత్, బసిల్ థంపి, టైమల్ మిల్స్, రిలె మెరిడిత్ వంటి ఫాస్ట్‌బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అందుకే ముంబయి ఇన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇకనైనా ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్లు గాడినపడతారో లేదో చూడాలి.
చెన్నై ఓటములకు ప్రధాన సమస్య అదే: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై కూడా ఈ సారి పేలవ ప్రదర్శనను కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలో మాత్రమే నెగ్గింది. చెన్నై ఓటములకు ఫాస్ట్‌బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమవడం వల్ల చెన్నైకి గట్టి షాక్ తగిలింది. ముఖేశ్ చౌదరి, డ్వేన్ బ్రావో కాస్త పరుగులు ఎక్కువగా ఇస్తున్నా వికెట్లు పడగొడుతున్నారు. క్రిస్ జోర్డాన్, ప్రిటోరియస్ ప్రభావం చూపలేకపోతున్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీసే నమ్మకమైన ఫాస్ట్‌బౌలర్ లేకపోవడం చెన్నైకి తీవ్ర ప్రతికులాంశంగా మారింది. రానున్న మ్యాచ్‌ల్లో ఫాస్ట్‌బౌలర్లు పుంజుకుంటేనే ఆ జట్టు విజయాలు సాధించే అవకాశం ఉంది.
మంచి బౌలర్లు ఉన్నా.. కోల్'కథ' మారట్లేదు: 2012, 2014 సంవత్సరాల్లో ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా జట్టు సీజన్‌లో ఆశించిన మేరకు రాణించడం లేదు. జట్టులో ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, రసెల్, ప్యాట్ కమిన్స్ లాంటి ఫాస్ట్‌బౌలర్లు ఉన్నా కోల్‌కతా పరాజయాల పాలవుతోంది. ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. రసెల్ అప్పుడప్పుడు వికెట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులిస్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడు బ్యాట్‌తో రెచ్చిపోయే ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో విఫలమవుతున్నాడు. దీంతో అతడిని పలు మ్యాచ్‌ల్లో తుది జట్టులోకి తీసుకోలేదు.
దిల్లీ.. ఎందుకిలా?: మంచి ఆటతీరుని ప్రదర్శిస్తూ గత కొన్ని సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న దిల్లీ జట్టు కూడా ఈ సారి తడబడుతోంది. ఈ జట్టులో శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, ఆన్రిచ్ నార్జ్, ముస్తాఫిజుర్ రెహ్మన్‌లతో పేస్ విభాగం పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా మ్యాచ్‌ల్లో తేలిపోతోంది. రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన శార్దూల్ ఠాకూర్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. 10 మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లే పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్ ఫర్వాలేదనిపిస్తున్నా.. మరింత ప్రభావం చూపాల్సిన అవసరముంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారి దిల్లీ ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించే అవకాశం ఉంది.
పంజాబ్‌లో రబాడ ఒక్కడే: ఈ ఏడాది పంజాబ్ జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఒక మ్యాచ్‌లో గెలుపు, మరో మ్యాచ్‌లో ఓటమిలా ఉంది ఆ జట్టు పరిస్థితి. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. 5 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. మరో ఐదింటిలో ఓటమిపాలైంది. గత సీజన్‌లో 21 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్ సింగ్ ఈ సారి నాలుగు వికెట్లే పడగొట్టాడు. కానీ, పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. పరుగులు కట్టడి చేయడం సహా వికెట్లు తీస్తే జట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సందీప్ శర్మ, వైభవ్ అరోరా, ఒడియన్ స్మిత్ అడపదడపా వికెట్లు తీస్తున్నారు. కగిసో రబాడ 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇతనికి తోడుగా ఇతర ఫాస్ట్‌బౌలర్లు వికెట్లు పడగొడితే జట్టు మరిన్ని విజయాలు సాధిస్తుంది.
గాడి తప్పిన హైదరాబాద్ బౌలింగ్: ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన హైదరాబాద్.. మళ్లీ తడబడుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. బౌలర్లు విఫలమవ్వడమే ఇందుకు గల ప్రధాన కారణం. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే ఐదు వికెట్లు పడగొట్టగా.. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ హైదరాబాద్ బౌలింగ్ మారలేదు. దీంతో ఇందులోనూ కేన్ సేనకు ఓటమి ఎదురైంది. మున్ముందు బౌలింగ్ తీరు ఇలానే కొనసాగితే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరుకోవడం కష్టంగా మారుతుంది. మిగతా మ్యాచ్‌ల్లోనైనా హైదరాబాద్ బౌలర్లు పుంజుకుంటారో లేదో చూడాలి.
టాప్‌లో ఉన్న జట్ల విజయాల్లో వీరిదే కీలకపాత్ర: కొత్త జట్టు గుజరాత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆ జట్టులోని ఫాస్ట్‌బౌలర్లు మహ్మద్ షమి, ఫెర్గూసన్, యశ్ దయాల్ కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతున్నారు. లఖ్‌నవూ విజయాల్లో అవేశ్ ఖాన్, జేసన్ హోల్డర్.. రాజస్థాన్ గెలుపుల్లో ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చదవండి: 'హిట్ మ్యాన్'కు తోడుగా మరో క్రికెటర్.. ఐపీఎల్లో 14 సార్లు డకౌట్