IPL 2022 RR Vs LSG: ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి కేఎల్ రాహుల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు సాధించి ఓటమిపాలైంది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యంతో దిగిన లఖ్‌నవూ జట్టు తొలి ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కెప్టెన్రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగగా.. కృష్ణప్ప గౌతమ్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. క్వింటన్ డాకాక్(39), దీపక్ హూడా(25), కృనాల్ పాండ్య(22), స్టోయినిస్(38) తప్ప మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహాల్ నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ 2, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో ఒక వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. లఖ్‌నవూ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బ్యాటర్లలో బ్యాటర్లలో షిమ్రోన్ హెట్‌మయర్ (59* : 36 బంతుల్లో 1×4, 5×6) అర్ధ శతకంతో రాణించాడు. దేవ్‌దత్ పడిక్కల్ (29), కెప్టెన్ సంజూ శాంసన్ (13), జోస్ బట్లర్ (13) పరుగులు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ (28) రిటైర్డ్ ఔట్‌గా మధ్యలోనే క్రీజు వీడాడు. వాండర్ డస్సెన్ (4), రియాన్ పరాగ్ (8) విఫలమయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ (2*) పరుగులు చేశాడు. లఖ్‌నవూ బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్ రెండు, జేసన్ హోల్డర్ చెరో రెండేసి వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇదీ చదవండి: కుల్దీప్, ఖలీల్ వికెట్ల పండగ.. దిల్లీ చేతిలో కోల్‌కతా చిత్తు