rajasthan vs kolkata: రాజస్థాన్ బ్యాటర్లు రెచ్చిపోయారు. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించారు. ఓపెనింగ్‌కు దిగిన జోస్ బట్లర్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి రావడం ఆలస్యం ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఐపీఎల్లో రెండో సెంచరీ(103) నమోదు చేశాడు. వన్‌డౌన్‌లో దిగిన సంజూ శాంసన్ సైతం పరుగుల వరద పారించాడు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐదు వికెట్లు కోల్పోయింది.
కొడితే ఫోర్, లేదంటే సిక్స్ అన్నట్టు సాగింది రాజస్థాన్ ఇన్నింగ్స్. ఓపెనింగ్‌లో వచ్చిన బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ నుంచి బట్లర్ తుఫాను మొదలైంది. ఆ ఓపర్ తొలి బంతికి ఫోర్ బాదిన బట్లర్.. రెండో బంతిని స్టాండ్‌లోకి పంపించాడు. చివరి బంతికి మరో నాలుగు పరుగులు రాబట్టి.. ఆ ఓవర్లో 16 రన్స్ పిండుకున్నాడు. అక్కడి నుంచి పరుగుల ప్రవాహం నిరాటంకంగా కొనసాగింది. ఓ ఎండ్‌లో దేవదత్ పడిక్కల్ ఆచితూచి ఆడుతుంటే.. బట్లర్ మాత్రం తన బ్యాటుకు పని చెప్పాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
నరైన్ రాకతో స్కోరు వేగం కాస్త తగ్గింది. పడిక్కల్‌ను నరైన్ ఔట్ చేయగా.. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్.. కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 19 బంతుల్లోనే 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 38 పరుగులు చేసి వెనుదిరిగాడు. 17వ ఓవర్లో భారీ సిక్స్‌తో సెంచరీ మార్కును చేరుకున్న బట్లర్.. అదే ఓవర్లో నాలుగో బంతికి ఔట్ అయ్యాడు. బట్లర్ వెనుదిరిగాక.. రాజస్థాన్ ఇన్నింగ్స్ సాధారణంగా మారిపోయింది. 18, 19వ ఓవర్లలో 10 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి ఓవర్లో హెట్మెయర్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. నరైన్ మినహా కోల్‌కతా బౌలర్లెవరూ రాణించలేదు. బట్లర్ వికెట్ తీసినప్పటికీ ప్యాట్ కమిన్స్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. శివమ్ మావి 19వ ఓవర్‌ను మెరుగ్గా వేశాడు.
ఇదీ చదవండి: రాజస్థాన్ హవా.. బ్యాటింగ్‌లో బట్లర్.. బౌలింగ్‌లో చాహల్!