Mumbai Indians Shoaib Akthar: ఐపీఎల్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబయి ఇండియన్స్.. ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్కదాంట్లోనూ గెలవలేదు. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయితే, శనివారం లఖ్‌నవూతో జరిగే మ్యాచ్‌లో ముంబయి తిరిగి గాడిన పడుతుందని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. గతంలోనూ ముంబయి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొందని గుర్తు చేశాడు.
IPL 2022: 'ఐదు, ఆరు గేమ్‌లు ఓడిపోతే తప్ప ముంబయి నిద్రలో నుంచి లేవదు. ఇది గత ఐపీఎల్ సీజన్లలోనూ చూశాం. వరుస ఓటముల నుంచి పుంజుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆ జట్టుకు మంచి మేనేజ్మెంట్ ఉంది. వేలంలో కొన్ని తప్పిదాలు చేసినప్పటికీ.. ఇప్పుడు వారు మెరుగ్గా ఆడతారనే నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చాడు అక్తర్. అదేసమయంలో.. గుజరాత్, లఖ్‌నవూ జట్లు చాలా బాగా ఆడుతున్నాయని ప్రశంసించాడు. ఈ రెండు టీమ్‌లలో ఒకటి ఫైనల్‌కు వెళ్తే బాగుంటుందని అన్నాడు.
Mumbai Indians Akash Chopra: మరోవైపు, ముంబయి తీరుపై భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులోని ఆటగాళ్లను ముంబయి ఇండియన్స్ సరిగా ఉపయోగించుకోవడం లేదని అన్నాడు. టిమ్ డేవిడ్ వంటి ఆటగాడికి రెండో అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. 'మా బెస్ట్ టీమ్‌తో ఆడుతున్నామని ముంబయి హెడ్ కోచ్ మహేల జయవర్ధనె చెబుతున్నాడు. కానీ, తుది జట్టు విషయంలో ముంబయి స్పష్టతతో లేదని తెలుస్తోంది. ఇదే వారి ఉత్తమ జట్టు అయితే టిమ్ డేవిడ్, ఫాబియన్ అలెన్, రిలీ మెరెడిత్ వంటి ఆటగాళ్లను ఎందుకు వేలంలో కొనుగోలు చేశారు? ఇద్దరు లేదా ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే ఆడాలనుకుంటే వీరంతా ఎందుకు?' అని ప్రశ్నించాడు.
అదేసమయంలో, పొలార్డ్ విషయంలోనూ ఆకాశ్ చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌లో లేని పొలార్డ్‌ను తుది జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించాడు. 'టీమ్‌లో బ్యాలెన్స్ లేదు. ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లతో ముంబయి బరిలోకి దిగుతోంది. లోయర్ ఆర్డర్లో ఆల్‌రౌండర్లు ఉండటం లేదు. సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను ఐదో స్థానంలో పంపిస్తున్నారు. ఇలాగేనా అతడిని ఉపయోగించుకునేది?' అని చెప్పుకొచ్చాడు ఆకాశ్. సింగపూర్ ఆల్‌రౌండర్ అయిన టిమ్ డేవిడ్‌ను రూ.8.25 కోట్లకు ముంబయి కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్‌లలో విఫలమైన నేపథ్యంలో తుది జట్టు నుంచి తప్పించింది.
ఇదీ చదవండి: ధనాధన్ బ్యాటింగ్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో రికార్డు అర్ధశతకాలివే