Irfan Pathan on Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో ముంబయిని వరుస వైఫల్యాలు వేధిస్తున్నాయి. ఇప్పటివరకు బోణీ కొట్టలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. శనివారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఐదుసార్లు ఛాంపియన్‌కు ఏమైందనే చర్చ నడుస్తోంది. ఈ సీజన్‌లో ముంబయికి సరైన పేస్ బౌలింగ్ దళం లేదని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. బుమ్రాకు తోడ్పాటునందించే స్థాయిగల బౌలర్ లేకపోవడం పెద్ద లోటు అని పేర్కొన్నాడు. బాసిల్ థంపి, జయ్‌దేవ్ ఉనద్కత్, డానియల్ సామ్స్, మిల్స్ వంటి బౌలర్లను ప్రయోగించినా ఫలితం మాత్రం దక్కలేదన్నాడు. భారీ మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేసిన జోఫ్రా ఆర్చర్ వచ్చే సీజన్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు.
''ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కమ్‌బ్యాక్ రావడమెలాగో ముంబయికి బాగా తెలుసు. గతంలోనూ ఇలాంటి సందర్భాలను ఎదుర్కొంది. 2014, 2015 సీజన్‌లో ఓటములతో ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా 2015లో అయితే ఏకంగా టైటిల్‌నే గెలుచుకుంది. అయితే అప్పటి జట్టుకు ఇప్పటి టీమ్‌కు వ్యత్యాసం ఉంది. ఈ సీజన్‌లో బుమ్రాకు మద్దతుగా నిలిచే మరో ఫాస్ట్‌బౌలర్ లేడు. ఇదే కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద తలనొప్పి తెచ్చే సమస్య. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ చాలా బాగా ఆడుతున్నారు. ఇషాన్ కిషన్ కూడా టాప్‌ఆర్డర్‌లో చెలరేగుతున్నాడు. అయితే రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ పరుగులు చేస్తే మాత్రం ముంబయిని ఆపడం ఎవరి తరమూ కాదు. బౌలింగ్ దళం బలహీనంగా ఉంది. అందులోనూ పేస్ దాడి స్థాయికి తగ్గట్టుగా లేదు.'' అని పఠాన్ వివరించాడు.
ఇవీ చూడండి: ఊతప్ప ఎంపికపై ధోనీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?