IPL 2022 CSK VS Punjab Kings: ఐపీఎల్-15లో పంజాబ్‌కు రెండో విజయం. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 54 పరుగుల తేడాతో చెన్నైపై ఘనవిజయం సాధించింది. లివింగ్‌స్టోన్ (60; 32 బంతుల్లో 5×4, 5×6) చెలరేగడం వల్ల మొదట పంజాబ్ 8 వికెట్లకు 180 పరుగులు సాధించింది. జోర్డాన్ (2/23), ప్రిటోరియస్ (2/30) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఛేదనలో చెన్నై తేలిపోయింది. వైభవ్ అరోరా (2/21), లివింగ్‌స్టోన్ (2/25), రాహుల్ చాహర్ (3/25)ల ధాటికి 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. రబాడ, అర్ష్‌దీప్, ఒడియన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబె (57; 30 బంతుల్లో 6×4, 3×6) చెన్నై తరఫున టాప్ స్కోరర్. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన లివింగ్‌స్టోన్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
చెన్నై విలవిల: లక్ష్య ఛేదనను అత్యంత పేలవంగా ఆరంభించింది చెన్నై. పంజాబ్ బౌలర్ల ధాటికి 8 ఓవర్లలో 38 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో కూరుకుపోయింది. రుతురాజ్ (13)ను ఔట్ చేయడం ద్వారా చెన్నై పతనాన్ని రబాడ ఆరంభించగా.. అరోరా తన వరుస ఓవర్లలో ఉతప్ప (13), మొయిన్ అలీ (0)లను వెనక్కి పంపాడు. జడేజాను అర్ష్‌దీప్ ఖాతా తెరవనివ్వలేదు. స్మిత్ బౌలింగ్‌లో రాయుడు (13) జితేశ్‌కు దొరికిపోయాడు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో దూబె, ధోని (23) నిలిచారు. ఇన్నింగ్స్‌కు మరమ్మతుల మొదలెట్టారు. ధోని సింగిల్స్ తీస్తూ స్ట్రైక్‌రొటేట్ చేయగా.. దూబె మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. అయినా సాధించాల్సిన రన్‌రేట్ బాగానే పెరిగింది. చివరి ఏడు ఓవర్లలో గెలవాలంటే 109 పరుగులు చేయాల్సిన పరిస్థితి. తర్వాతి ఓవర్లో, రబాడ బౌలింగ్‌లో దూబె వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. లక్ష్యం కష్టంగానే ఉన్నా చెన్నైలో ఆశలు చిగురించిన దశ అది. కానీ ఆ ఆశలు ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. బ్యాటుతో చెలరేగిన లివింగ్‌స్టోన్.. ఈసారి బంతితోనూ చెన్నైని దెబ్బతీశాడు. 15వ ఓవర్లో అతడు వరుస బంతుల్లో దూబె, బ్రావోను ఔట్ చేయడంతో పంజాబ్ విజయం దాదాపుగా ఖాయమైపోయింది. ఎందుకంటే చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్న చెన్నై.. చివరి నాలుగు ఓవర్లలో చేయాల్సింది 74 పరుగులు. 18వ ఓవర్ తొలి బంతికి ధోనీని రాహుల్ చాహర్ ఔట్ చేయడంతో చెన్నై ఓటమి లాంఛనమే అయింది.
లివింగ్‌స్టోన్ ధనాధన్: ఇన్నింగ్స్ అలా ఆరంభమైందో లేదో ఇలా వికెట్ పోయింది. రెండో బంతికే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఔట్. ముకేశ్ చౌదరి అతణ్ని వెనక్కి పంపాడు. రెండో ఓవర్లో ధోని చురుకుదనంతో రాజపక్స (9) రనౌటయ్యాడు. అప్పటికి స్కోరు 14 పరుగులే. అయినా పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్ 72/2తో బలమైన స్థితిలో నిలిచింది. కారణం లయామ్ లివింగ్‌స్టోన్ విధ్వంసం. అలవోకగా భారీ షాట్లు ఆడిన అతడు ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. ముఖ్యంగా ముకేశ్ చౌదరికి చుక్కలు చూపించాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన లివింగ్‌స్టోన్.. అతడి తర్వాతి ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లివింగ్‌స్టోన్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులొచ్చాయి. మరోవైపు ధావన్ (33; 24 బంతుల్లో 4×4, 1×6) కూడా జోరందుకుని బ్రావో బౌలింగ్‌లో సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు. పదో ఓవర్లో 109/2తో పంజాబ్ భారీ స్కోరు దిశగా ఉరకలేసింది. అలవోకగా 200 దాటేలా కనిపించింది. కానీ చెన్నై బౌలర్లు పుంజుకోవడంతో అనుకున్న దాని కంటే తక్కువ స్కోరుతో సరిపెట్టుకుంది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న దశలో, 6 పరుగుల వ్యవధిలో నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్ ఇద్దరినీ వెనక్కి పంపి చెన్నై ఊపిరి పీల్చుకుంది. ధావన్‌ను బ్రావో ఔట్ చేయడంతో 95 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాతి ఓవర్లోనే లివింగ్‌స్టోన్ జోరుకు జడేజా తెరదించాడు. నిజానికి అతడు ముందే ఔట్ కావాల్సింది. మొదట జడేజా బౌలింగ్‌లో రాయుడు క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. తర్వాత ప్రిటోరియస్ బౌలింగ్‌లో ధోని అతడి క్యాచ్ అందుకున్నా, బంతి ఆఖర్లో నేలను తాకింది. ఈ రెండు వికెట్లు పడ్డాక ఆట గమనం మారిపోయింది. జితేష్ (26; 17 బంతుల్లో 3×6) బ్యాట్ ఝుళిపించడంతో 14 ఓవర్లలో 142/4తో పంజాబ్ బలంగానే నిలిచినా.. కానీ ప్రిటోరియస్, జోర్డాన్, బ్రావో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరి 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 38 పరుగులే చేయగలిగింది.
ఇదీ చదవండి: IPL 2022: దుమ్ములేపిన లివింగ్‌స్టోన్.. చెన్నై ముందు భారీ లక్ష్యం