చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో గెలుపొందడం గొప్ప విజయమని, ఇది కచ్చితంగా తాము టాప్‌లో 2లో నిలిచేలా చేస్తుందని దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో దిల్లీ పది విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ ఇలా స్పందించాడు.
"ఇది నా పుట్టినరోజు (అక్టోబర్ 4) కానుక కాదు. ఇదో కష్టతరమైన మ్యాచ్. చివరికి మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది. తొలుత పవర్‌ప్లేలో చెన్నై బ్యాట్స్‌మెన్ బాగా ఆడారు. తర్వాత మేం కొన్ని ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాం. చివర్లో రాయుడు బాగా ఆడటం వల్ల చెన్నై కొన్ని ఎక్కువ పరుగులు సాధించింది. ఇక మా ఇన్నింగ్స్‌లో పృథ్వీ(18) ఆదిలోనే మూడు ఫోర్లు కొట్టి మంచి ఆరంభం ఇచ్చాడు. అతడికి ధావన్ అండగా ఉండి సహకరించాడు. ఇది చిన్న లక్ష్యమే కావడంల వల్ల మొదటి నుంచి పోటీలోనే ఉన్నాం. చివర్లో హెట్‌మెయర్ మా పని పూర్తి చేశాడు. మరోవైపు అశ్విన్‌ను కాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపడానికి ప్రత్యేక కారణాలు లేవు. కుడి-ఎడమ కాంబినేషన్ కోసమే అలా ముందుగా పంపించాం. చివరికి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. అయితే, ఇది మాకు చాలా పెద్ద విజయం. ఎందుకంటే ఇది మమ్మల్ని కచ్చితంగా టాప్ 2లో నిలిచేలా చేస్తుంది" అని పంత్ వివరించాడు.
150 స్కోర్ చేసుంటే బాగుండేది: ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ.. "మేం బ్యాటింగ్ చేసేటప్పుడు స్కోర్ బోర్డుపై 150 పరుగులు సాధించాలనుకున్నాం. కానీ, ఆరంభంలోనే పలు వికెట్లు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దీంతో ధాటిగా ఆడలేక విఫలమయ్యాం. చివరికి 15-16 ఓవర్ల తర్వాత పిచ్ అనుకూలంగా మారడం వల్ల రాయుడు బాగా ఆడాడు. ఏమైనా జట్టు స్కోర్ 150 పరుగుల దాకా ఉంటే బాగుండేది. పోరాడటానికి వీలుండేది. కాగా, ఈ పిచ్ రెండు విధాలుగా ఉంది. మరీ నెమ్మదిగా లేదు. అలా అని షాట్లూ ఆడలేము. దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌కు కూడా ఇలాగే జరిగింది. ఇది ఎత్తుగా ఉన్న బౌలర్లకు అనుకూలమైన వికెట్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌ను దిల్లీ కైవసం చేసుకోవడానికి బాగా కష్టపడింది. మేం పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు ఇవ్వాల్సింది కాదు. ధావన్ ఆడిన 4వ ఓవర్‌లో 20 రాబట్టాడు. మేటి బ్యాట్స్‌మెన్ ఆడేటప్పుడు ఇవన్నీ సహజమే" అని ధోనీ స్పందించాడు.
ఇదీ చదవండి:IPL 2021 News: ఒకే ఒక జట్టుగా దిల్లీ.. ధోనీ చెత్త రికార్డు