ఒకవైపు డేవిడ్ వార్నర్ మెరుపులు.. మరోవైపు విరాట్ కోహ్లీ దూకుడు.. ఇంకోవైపు భువీ, ఫిజ్ చురకత్తుల్లాంటి బంతులు.. ఆరంభంలో క్రిస్‌గేల్.. ఆఖర్లో బెన్ కటింగ్ విధ్వంసం.. మొత్తంగా నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరు.. క్షణ క్షణం ఉత్కంఠభరింతంగా మారిన పోటీ.. ఆఖరికి 8 పరుగుల తేడాతో విజయం..! గుర్తొచ్చాయా సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన క్షణాలు.. మరచిపోలేని ఆ అనుభూతులు. 2016లో సరిగ్గా వార్నర్ సేన సంచలనం సృష్టించి నేటికి (మే 29) ఐదేళ్లు. ఓ సారి ఆ మ్యాచ్‌పై లుక్కేద్దాం..
ఆరంభంలో వార్నర్.. ఆఖర్లో కటింగ్
2016లో ఆర్‌సీబీ భీకరమైన ఫామ్‌లో ఉంది. ఎలాంటి స్కోర్లనైనా ఛేదిస్తోంది. విరాట్ కోహ్లీ కెరీర్లోనే వీరోచితమైన ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు శతకాలు బాదేశాడు. అలాంటిది చిన్నస్వామి మైదానంలో టాస్ గెలవగానే సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్ (69; 38 బంతుల్లో 8×4, 3×6), శిఖర్ ధావన్ (28; 25 బంతుల్లో 3×4, 1×6) శుభారంభమే అందించారు. దాంతో 6 ఓవర్లకు జట్టు 59 పరుగులు చేసింది. గబ్బర్, హెన్రిక్స్ (4) త్వరగా ఔట్ అయినప్పటికీ యువీ (38; 23 బంతుల్లో 4×4, 2×6) సహకారంతో వార్నర్ దూకుడు కొనసాగించాడు. వీరిద్దరూ 11 ఓవర్లకే స్కోరును 100 దాటించారు. జట్టు స్కోరు 125 వద్ద డేవీ వెనుదిరిగాడు. 16.2 ఓవర్లకే స్కోరు 150 దాటినా యువీ, దీపక్ హుడా (3), నమన్ ఓజా (7), బిపుల్ శర్మ (5) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడం వల్ల ఉత్కంఠ కలిగింది. కానీ బెన్‌కటింగ్ (39*; 15 బంతుల్లో 3×4, 4×6) 20వ ఓవర్లో 4, 6, 6, 1, 6 బాదేసి స్కోరును 208కు చేర్చాడు.
గేల్, కోహ్లీ తుపాను.. కానీ!
జోరుమీదున్న ఆర్‌సీబీ అనుకున్నట్టే దూకుడుగా ఛేదన ఆరంభించింది. క్రిస్‌గేల్ (76; 38 బంతుల్లో 4×4, 8×6), విరాట్ కోహ్లీ (54; 35 బంతుల్లో 5×4, 2×6) విధ్వంసకరంగా ఆడారు. గేల్ తుపాను సృష్టించాడు. బౌండరీలు మాత్రమే బాదుతా అన్నట్టు ఆడాడు. దాంతో స్కోరు 6 ఓవర్లకు 59; 7 ఓవర్లకు 100 దాటేసింది. అయితే జట్టు స్కోరు 114 వద్ద గేల్‌ను కటింగ్, 140 వద్ద కోహ్లీని బరిందర్ శరణ్ పెవిలియన్ పంపడం వల్ల బెంగళూరు జోరుకు బ్రేకులు పడ్డాయి. 15 ఓవర్లకే 150 దాటినా ఏబీ డివిలియర్స్ (5), రాహుల్ (11), వాట్సన్ (11) పరుగులు చేయడంలో విఫలమవ్వడం వల్ల ఒత్తిడి పెరిగింది. ఆఖరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా.. భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి 3 బంతుల్లో 3 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఆఖరి 3 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా ఆర్‌సీబీ 6 పరుగులే చేసింది. వార్నర్ సేన ట్రోఫీని ముద్దాడింది.
ఇదీ చూడండి ipl 2021: యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండో దశ