ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడటం వల్ల తమ క్రికెటర్లు ఎంతగానో ప్రయోజనం పొందారని ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ అన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ గెలవడంలో ఐపీఎల్ అనుభవం పనిచేసిందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆడటంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపించడంపై అతడు ఈ విధంగా స్పందించాడు.
"అవును, మేం ఐపీఎల్ నుంచి ఎంతగానో ప్రయోజనం పొందాం. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా అభివృద్ధిలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా 2019లో వన్డే ప్రపంచకప్ గెలవడానికి ఉపయోగపడింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉండటం వల్ల ప్రపంచంలోనే అతిపెద్దదైన ఐపీఎల్‌లో ఇలాగే భాగస్వాములం అవుతామని ఆశిస్తున్నాం. దీని నుంచి మేమెంతో ఆత్మవిశ్వాసం, అనుభవం సాధించాం."
- ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ టీ20 జట్టు కెప్టెన్
వ్యక్తిగతంగానూ ఐపీఎల్ నుంచి ఎంతో నేర్చుకున్నానని మోర్గాన్ అన్నాడు. "ఐపీఎల్ నుంచి వచ్చే అనుభవం గొప్పది. ప్రపంచకప్‌లు ఆడే ఆటగాళ్లు ఇందులో ఉంటారు. అత్యుత్తమ ఆటగాళ్లతో స్నేహం చేయొచ్చు. వారి సలహాలు తీసుకోవచ్చు. ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్చుకోవచ్చు. ఇవన్నీ వెలకట్టలేనివి. ఐపీఎల్‌కు వచ్చిన తొలినాళ్లలోనే నాకీ అనుభవాలన్నీ రాలేదు. కాలం గడిచే కొద్దీ నేర్చుకున్నాను. ఇప్పుడు భారత్‌లోనే ఐపీఎల్ జరగడం సంతోషకరం" అని మోర్గాన్ వెల్లడించాడు.
ఇదీ చూడండి: టీమ్ఇండియా ఓపెనర్లు ఎవరో చెప్పేసిన కోహ్లీ