చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ ఈ ఐపీఎల్ (IPL 2021) రెండో దశలో తన బ్యాట్‌కు పనిచెప్తాడని ధీమా వ్యక్తం చేశాడు ఆ జట్టు పేస్ బౌలర్ దీపక్ చాహర్. రెగ్యులర్ క్రికెట్‌కు దూరమైన తర్వాత ఏ ఆటగాడైన ఫామ్‌లోకి రావాలంటే కొంత సమయం పడుతుందని చెప్పాడు. ఈ సీజన్ తొలి దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మహీ 37 పరుగులు మాత్రమే చేశాడు.
"ఓ బ్యాట్స్‌మన్ 15-20ఏళ్లు ఒకేలా ఆడలేడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ప్లేయర్స్.. ఐపీఎల్ వంటి ఆటల్లో పాల్గొనడం, మునపటి ఫామ్‌ను ప్రదర్శించడం అంత సులువు కాదు. దానికి కొంత సమయం పడుతుంది. కానీ మహీ రెగ్యులర్ క్రికెట్ ఆడనప్పటికీ ఎప్పుడూ ఫినిషర్ పాత్రను బాగా పోషించాడు. 2018-19 సీజన్లో ధోనీ (Dhoni) భయ్యా నెమ్మదిగా తన స్థాయికి తగ్గట్లు ఆడటం ప్రారంభించాడు.. కానీ స్ట్రోక్ ప్లే మాత్రం అద్భుతంగా ఆడాడు. కాబట్టి ఈ సీజన్ రెండో అంకంలో అతడి ఉత్తమ ప్రదర్శన చూడొచ్చు" అని చాహర్ వెల్లడించాడు.
ధోనీ తనపై నమ్మకం ఉంచి స్ట్రైక్ బౌలింగ్ చేయడానికి అవకాశాలు ఇచ్చాడని తెలిపాడు చాహర్. "సీఎస్కే(CSK)తో నా ప్రయాణం మొదలై ఇది నాలుగో సంవత్సరం. మహీ భయ్యా నాపై నమ్మకం ఉంచి బౌలింగ్ చేయడానికి అవకాశాలు ఇచ్చాడు. నమ్మకం అనేది చాలా ముఖ్యం. అందుకే అతడు నాతో సహా ఎంతోమంది ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. పరిస్థితులకు తగ్గట్టు ఏ ఆటగాడిని ఎలా ఉపయోగించాలనేది ఓ సారథిగా మహీకి బాగా తెలుసు. అది అతడి సామర్థ్యం. అతడి నుంచి ఎన్నో మెళకువల్ని నేర్చుకున్నా" అని చాహర్ వివరించాడు.
నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ (IPL14)ను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 18 లేదా 19 తేదీలలో తిరిగి నిర్వహించనున్నట్లు ఓ బీసీసీఐ (BCCI) సీనియర్ అధికారి ఇటీవలే వెల్లడించారు. మొత్తంగా 10 రోజుల పాటు రెండేసి మ్యాచ్‌లు జరుపుతారని సమాచారం.
ఇదీ చూడండి యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారంలో ఐపీఎల్!