ఐపీఎల్-14 వాయిదా పడక ముందు బెట్టింగ్ ముఠా కొత్త పంథాలో అవినీతికి తెరలేపినట్లు తాజాగా వెల్లడైంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఓ క్లీనర్ ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్ సమాచారాన్ని అందుకుని.. బంతిబంతికీ బెట్టింగ్‌కు పాల్పడిన విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) ప్రధాన అధికారి షబ్బీర్ హుస్సేన్ బుధవారం బయటపెట్టాడు. ఆ క్లీనర్‌ను గుర్తించి పోలీసులకు అప్పగించినట్లు తెలిపాడు.
మైదానంలో మ్యాచ్‌కు, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారానికి కొన్ని సెకన్ల తేడా ఉంటుంది. మ్యాచ్‌లో బంతి పడిన కొద్దిసేపటికి అది టీవీల్లో వస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న బెట్టింగ్ ముఠా ఓ క్లీనర్ ద్వారా బంతిబంతికీ ఏం జరిగిందనే విషయాన్ని ముందుగానే తెలుసుకునే పథకం వేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఓ మ్యాచ్ సమయంలో ఆ క్లీనర్ అనుమానాస్పదంగా కనిపించడం వల్ల ఓ ఏసీయూ అధికారి అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. అంతే కాకుండా ఆదివారం అదే మైదానంలో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు నకిలీ గుర్తింపు కార్డులతో వచ్చిన ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.
‘"క్లీనర్‌గా పనిచేస్తూ బెట్టింగ్ ముఠాకు సమాచారం చేరవేస్తున్న వ్యక్తిని మా ఏసీయూ అధికారి పట్టుకున్నాడు. మైదానం సమీపంలో అతను నిలబడి ఉండడం చూసి మా అధికారి 'ఇక్కడ ఏం చేస్తున్నావు' అని ఆ క్లీనర్‌ను అడిగాడు. 'నా ప్రేయసితో మాట్లాడుతున్నా' అని అతను బదులిచ్చాడు. అనుమానం వచ్చిన మా అధికారి అతని ఫోన్‌ను పరీక్షించబోగా తను రెండు ఫోన్లను అక్కడే వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాం’" అని షబ్బీర్ పేర్కొన్నాడు.