ప్రపంచకప్ ఆడటం ప్రతి ఆటగాడి కల. అందుకోసం ఎంతో కృషి చేయడమూ అవసరం. అనుభవమున్న ఆటగాళ్లు సరే.. మరి యువ ఆటగాళ్ల మాటేంటి?. వారికీ ఈ మెగాటోర్నీ మంచి వేదిక. 2019 క్రికెట్ విశ్వసమరంలో కొత్త ఆటగాళ్లు సత్తా చాటారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వనియోగం చేసుకుని చెలరేగి ఆడారు. వారిపై ఓ లుక్కేద్దాం.
షాహీన్ అఫ్రిదీ (పాకిస్థాన్)
ఈ ప్రపంచకప్ ద్వారా పాకిస్థాన్‌కు ఓ మంచి లెఫ్టార్మ్ పేసర్ దొరికినట్టయింది. ప్రారంభంలో అవకాశం రాకపోయినా.. మధ్యలో వచ్చిన అవకాశాన్ని కాపాడుకుని 5 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి సత్తాచాటాడు. ఈ యువ ఆటగాడి ప్రతిభ చూసిన క్రికెట్ అభిమానులు అతడిని పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్‌తో పోలుస్తున్నారు. భవిష్యత్‌లో మంచి ఆటగాడు అవుతాడని ప్రశంసిస్తున్నారు.
జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్ యువ పేసర్ జోఫ్రా ఆర్చర్ పేరు ప్రపంచకప్‌నకు ముందు అంతగా ఎవరికీ తెలియదు. టోర్నీ ప్రారంభానికి ముందే మేలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆర్చర్ అనూహ్యంగా వరల్డ్‌కప్ జట్టులో చోటు సంపాదించాడు. డేవిడ్ విల్లే గాయం కారణంగా తప్పుకోగా.. ఈ యువ ఆటగాడికి అవకాశం లభించింది. ఇంగ్లాండ్ సారథి మోర్గాన్.. జోఫ్రాకు స్వేచ్ఛనిస్తూ ప్రోత్సహించగా.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీలో 20 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానం సాధించాడు.
అలెక్స్ కారే (ఆస్ట్రేలియా)
వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా జట్టులో చోటు సంపాదించాడు కారే. ఆసీస్ తరఫున 375 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో దవడకు గాయమై రక్తం కారుతున్నా.. బ్యాటింగ్ చేసి అబ్బురపరిచాడు. కారేను ఆసీస్ మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తున్నారు అభిమానులు.
ఇక్రామ్ అలీ ఖాన్
అఫ్గానిస్థాన్ యువ ఆటగాడు ఇక్రామ్ అలీ వయస్సు 18 ఏళ్లు. వెస్టిండీస్‌పై 86 పరుగులు సాధించి ప్రపంచకప్‌లో అత్యంత పిన్న వయసులో 80 పైన పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రికెటర్ ప్రతిభను గుర్తించి అఫ్గాన్ క్రికెట్ మరిన్ని అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే మరింతగా రాటుదేలుతాడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఇవీ చూడండి.. 'ఇదిగో యువీ.. నా బాటిల్ క్యాప్ ఛాలెంజ్'