IPL media rights Sunil gavaskar: ఐపీఎల్ విలువ ఈ స్థాయికి చేరుతుందని అస్సలు ఊహించలేదని టీమ్‌ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. ముంబయి వేదికగా జరుగుతోన్న ఈ వేలంలో వచ్చే ఐదేళ్లకు టోర్నీ ప్రసార టీవీ, డిజిటల్ హక్కులను సోమవారం రెండు వేర్వేరు సంస్థలు కొనుగోలు చేశాయి. టీవీ హక్కులు రూ.23,575 కోట్ల ధర పలకగా.. డిజిటల్ హక్కులు రూ.20,500 కోట్ల ధర పలికాయి. దీంతో పాటు అదనంగా మరో రూ.2 వేల కోట్లు ఖాయమయ్యాయి. దీంతో సోమవారం మొత్తం విలువ రూ.46 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే సన్నీ దీనిపై మాట్లాడాడు.
"ఈ ప్రసార హక్కుల విలువ చూస్తుంటే భారత్‌లో ఈ లీగ్‌కు ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలుస్తోంది. 2008లో ఈ టోర్నీ ప్రారంభమైనప్పుడు 15 ఏళ్ల తర్వాత.. ఇలాంటి మ్యాజిక్ ఫిగర్లు (ప్రసార హక్కుల ధరలు) చూస్తాననుకోలేదు. ఇది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. మీరంతా ఈ టోర్నీని నాణ్యమైన విధంగా ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎప్పుడూ వీక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ టోర్నీని క్రికెట్ అభిమానులు బాగా ఆదరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసార హక్కుల కోసం వచ్చిన ధర చూస్తుంటే మతిపోతోంది" అని గావస్కర్ పేర్కొన్నాడు.
Gavaskar Umran malik: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరిస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. బౌలింగ్ లోపాలు పరాజయానికి కారణంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో జరగనున్న మూడో మ్యాచ్‌కు జట్టులో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌తో స్పీడ్‌స్టార్ ఉమ్రాన్ మాలిక్‌తో పాటు అర్షదీప్ సింగ్‌లకు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్రాన్‌పై సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. "ఒకప్పుడు టీమ్‌ఇండియా క్రికెటర్లలో సచిన్ ఆటను చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూసేవాడిని. ఇప్పుడు ఉమ్రాన్ ఆట కోసం చూస్తున్నా. మూడో టీ20లో అతడికి అడించాలని ఆశిస్తున్నా. అతడు తప్పకుండా రాణిస్తాడని నమ్ముతున్నా." అని సన్నీ అన్నాడు. ఇదీ చూడండి: జేమ్స్ అండర్సన్ @650.. తొలి పేసర్‌గా అరుదైన రికార్డు