Virat Kohli on KL Rahul: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కొత్త సారథి కేఎల్ రాహుల్ కెరీర్ ఆరంభంలో టీ20 స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌లా కనిపించలేదని రాయల్ ఛాలెంజర్స్ మాజీ సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ఇటీవలే కోహ్లీ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే మొదట్లో అతడితో.. తాను పెద్దగా కనెక్ట్ కాలేకపోయానని చెప్పాడు. రాహుల్ 2013లో ఆర్సీబీ జట్టులో ఆడగా తర్వాతి రెండేళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. తిరిగి 2016లో బెంగళూరు గూటికే చేరిన అతడు ఆ సీజన్‌లో 397 పరుగులతో రాణించాడు.
"కరణ్ నాయర్, మయాంక్ అగర్వాల్‌తో కలిసి రాహుల్ 2013లో బెంగళూరు జట్టులోనే ఆడాడు. అయితే, అప్పుడు అతడు టీ20 బ్యాట్స్‌మన్‌లా అస్సలు కనిపించలేదు. ఇక అతడు ఆర్సీబీ జట్టును వీడాక నేను పట్టించుకోలేదు. కానీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం అదరగొడుతున్నాడనే విషయాలు తెలుసుకున్నా. మా జట్టులో ఆడినప్పుడు యువకుడిలా ఉండేవాడు. మేం ఇద్దరం కలిసి ఎన్ని మ్యాచ్‌లు ఆడినా పెద్దగా కనెక్ట్ కాలేకపోయాం. ఇక 2014లో అతడు ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా తరఫున టెస్టు అరంగేట్రం చేసినప్పుడు మాత్రం బాగా ఆకట్టుకున్నాడు. ఆటపై దృష్టిసారించి ఎంతో మెరుగ్గా తిరిగొచ్చాడు. దీంతో కంగారూల గడ్డపై మంచి ప్రదర్శన చేశాడు. అప్పుడే అతడి ఆత్మస్థైర్యం చూసి ముచ్చటేసింది" అని కోహ్లీ వివరించాడు.
ఇదీ చూడండి: Rohit Sharma: 'టీమ్‌ఇండియా భవిష్యత్తు కెప్టెన్స్ వాళ్లే!'